
ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించినట్లుగా పురాణాలు చెబుతున్న ‘ద్వారక’ నగరం కాలక్రమంలో అరేబియా సముద్రంలో మునిగినట్లుగా భక్తులు విశ్వసిస్తారు. సముద్ర గర్భంలోని ఈ నగరాన్ని వీక్షించేందుకు గుజరాత్ ప్రభుత్వం జలాంతర్గామి సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం ముంబయికి చెందిన ప్రభుత్వరంగ ‘మజాగాన్ నౌకా నిర్మాణసంస్థ’ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జలాంతర్గామికి 24 మంది యాత్రికులను తీసుకువెళ్లే సామర్థ్యం ఉంటుందని గుజరాత్ పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు. పర్యాటకులతోపాటు ఇద్దరు పైలట్లు, ఇద్దరు చోదకులు, సాంకేతిక నిపుణుడు, గైడ్ కూడా ఉంటారన్నారు. ఈ జలాంతర్గామి భక్తులను అరేబియా సముద్రంలో 300 అడుగుల దిగువకు తీసుకెళ్తుందని.. అక్కడ పురాతన నగర శిథిలాలతోపాటు అరుదైన సముద్ర జీవులను చూడవచ్చన్నారు. జలాంతర్గామి సర్వీసును ఏర్పాటు చేస్తుండటంపై యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.





