News

ప్రకృతిలో పరమాత్మను చూడటమే మన సంప్రదాయం

395views

చెట్టు, పుట్ట, రాయీరప్పా, నీరు, నిప్పు.. ఇలా అన్నింటిలో పరమాత్మను చూడటం, అన్నింటినీ పూజించడం భారతీయ సంప్రదాయమ ని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. రాజమహేంద్రవరంలోని హిందూ సమాజంలో ఆయన శ్రీరామాయణ ప్రవచనం 14వ రోజైన మంగళవారం కూడా కొనసాగింది. ‘గంగ, యమున నదులను దాటుతున్న సీతాదేవి ఆయా నదులకు నమస్కరించి, మొక్కింది. యమున దాటాక కనపడిన పెద్ద వృక్షానికి కూడా పూజలు చేసింది. చిత్రకూట పర్వతం వద్దకు వెళ్తున్న సీతారామలక్ష్మణులు వాల్మీకి ఆశ్రమాన్ని దర్శించారు. చిత్రకూటం వద్ద రాముని సూచనలపై లక్ష్మణుడు పర్ణశాల నిర్మించాడు. రాముడు వాస్తుపూజలు నిర్వహించాడు. నిర్మాణానికి భూమిని తవ్వుతున్న సమయంలో కొన్ని ప్రాణులకు హాని జరుగుతుంది. ఈ దోషం తొలగిపోవడానికి వాస్తు పూజలు చేయాలి’ అని రామాయణ సన్నివేశాలను సామవేదం వివరించారు.

రామాయణంలో జ్యోతిష, వాస్తు, శకున శాస్త్ర అంశాలు అనేకం కనపడతాయని చెప్పారు. ‘అయోధ్యకు తిరిగి వచ్చిన సుమంత్రుడు కళా విహీనమైన నగరాన్ని చూశాడు. దశరథుని వద్దకు వచ్చిన అతడు.. రాముడు తల్లిదండ్రులకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని చెప్పమన్నాడని తెలిపాడు. భరతునితో తల్లులందరినీ సమానంగా చూడమన్నాడని చెప్పాడు. లక్ష్మణుడు బుసలు కొడుతూ దశరథుని నేను తండ్రిగా భావించడం లేదు. ఏ తప్పు చేశాడని రాముని అడవులకు పంపారు? నాకు తండ్రి, దైవం, బంధువు, ప్రభువు, నా సర్వస్వం రాముడే అని సందేశం పంపాడు. సీతమ్మ తల్లి ఏమీ మాట్లాడలేదు. మనస్సు పూర్తిగా రామునిలో లీనమైనందున ఆమె నిర్జనారణ్యంలో సైతం ఆనందంగా ఉందని చెప్పాడు. దశరథుడు రాముని స్మరిస్తూ ప్రాణాలు వదిలాడు. ఆ సమయంలో ఆయన వద్ద ఒక్క కొడుకూ లేడు’ అని సామవేదం అన్నారు. కానీ భగవంతుని స్మరణలో, రామనామం ధ్యానిస్తూనే ప్రాణత్యాగం చేశాడని చెప్పారు. కష్టాల్లో సైతం ధర్మాచరణ వదలని జీవితమే సార్థకమని అన్నారు.