
గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టిన రోజు. ఇది భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని శుద్ధ ఏకాదశి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం డిసెంబర్ 22న గీతా జయంతిని జరుపుకుంటున్నాము. భగవద్గీతలో అన్ని జీవితాల సారాంశం ఉంది. ప్రతి అడుగును విజయవంతం చేయడంలో ఈ పవిత్ర గ్రంథంలో ఉన్న శ్లోకాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి.
మహాభారతంలోని కురుక్షేత్ర సమయంలో శ్రీకృష్ణుడు గీత బోధనల ద్వారా ధర్మం, కర్మ మరియు జ్ఞానాన్ని అందించడం ద్వారా అర్జునుడికి జ్ఞానోదయం చేశాడు. భగవద్గీతలో 18 అధ్యాయాలు మరియు 700 శ్లోకాలు ఉన్నాయి. కర్మ యోగ బోధనలు మొదటి 6 అధ్యాయాలలో, జ్ఞాన యోగా తదుపరి ఆరు అధ్యాయాలలో మరియు భక్తి యోగం చివరి అధ్యాయాలలో వివరించబడ్డాయి.
పురాణం ప్రకారం గీత అనే రెండు అక్షరాలకు గొప్ప శక్తి ఉంది. ‘‘గీ’’ అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తుంది. ‘‘త’’ అనే అక్షరం తత్త్వం లేదా ఆత్మ యొక్క స్వభావాన్ని సూచిస్తుంది. దీని అర్థం కర్మ పరత్యాగం లేదా సర్వ సంగపరిత్యాగం అంటే త్యాగానికి యోగం.
మహాభారతంలో భగవద్గీత ఒక భాగమైనా, భగవద్గీతకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్క భగవద్గీత ఎన్నో పురాణేతిహాసాలకు సమానం. అంటే అన్ని ఇతిహాసాలు చదవనక్కరలేదు ఒక్క భగవద్గీత చదివితే చాలు. జీవిత పరమార్థం తెలుస్తుంది. కర్తవ్య విముఖుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యం వైపు మళ్ళించడమే గీత లక్ష్యం. భగవద్గీత అనగా అది ఏదో మతానికి సంబంధించిన, సన్యాసులు లేదా వయసు అయిపోయిన వారు చదివే గ్రంథముగా చూస్తారు. కానీ చిన్ననాటి నుండి పిల్లలకు గీతాసారం వంటబడితే..జీవితంలో ఉన్నతమైన వ్యక్తులుగా మిగులుతారు.
ఇప్పుడు మానసిక నిపుణులు కూడా వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీతను మించిన పాఠం లేదని తెలియజేస్తున్నారు. ప్రపంచంలోని అన్ని ప్రధాన భాషల్లోకి అనువాదమైన మహత్తర గ్రంథం భగవద్గీత. మహాత్మాగాంధీ, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, మాక్స్‌ముల్లర్, దారాషికో, ఆర్నాల్డ్ ఎడ్వర్డ్ వంటి దేశదేశాల ప్రముఖులందరి ప్రశంసలను భగవద్గీత పొందింది.
‘కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన’ అంటే కర్తవ్య విమూఢత్వాన్ని విడనాడు, నీ విధిని నువ్వు నిర్వర్తించు అని అర్థం. ఇక ముందుకు వెళ్లలేమన్న నిరాసక్తత ఏర్పడినప్పుడు భగవద్గీతలోని ఈ శ్లోకం తనలో తిరిగి ఆత్మవిశ్వాసం నింపుతుందని సాక్షాత్తూ జాతిపిత మహాత్మాగాంధీ తెలిపారు. ఆయన భారతీయుడు కాబట్టి, భగవద్గీత పట్ల భక్తి ప్రపత్తులు ఉండడం సహజం అనుకుందాం. మరి ఎడ్వర్డ్ ఆర్నాల్డ్..ఈయన భారతీయుడు కాదు ఈయన ఒక బ్రిటీష్ కవి. భగవద్గీతను ఇంగ్లీషులోకి అనువదించారు. ఈయన అనువదించిన ఇంగ్లీష్ భగవద్గీత నుంచే గాంధీ మహాత్ముడు భగవద్గీత సారాంశాన్ని, సందేశాన్ని తెలుసుకున్నారు. ఇక ఆల్బర్ట్ ఐన్‌స్టీన్..ఈయన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త. అణుశక్తికి మూలకారకమైన పదార్థాన్ని కనుగొన్న మహామేధావి. ఈయన ఏమన్నాడంటే తాను భగవద్గీతను చదివి, దేవుడు ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాడో అని ఆలోచించినప్పుడు మిగతావన్నీ చాలా నిరుపయోగంగా అనిపించాయన్నారు.
మొగల్ చక్రవర్తి, మతోన్మాది ఔరంగజేబు సోదరుడు దారాషికో భగవద్గీతతో ప్రభావితుడై ఆ మహాగ్రంథాన్ని పర్షియన్‌లోకి తర్జుమా చేశాడు. జర్మన్ పండితుడు ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్ సైతం భగవద్గీతతో ప్రభావితులైన ప్రముఖుల్లో ఒకరు. భగవద్గీత ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతోందంటూ ఆ మధ్య రష్యన్ న్యాయస్థానంలో ఓ ప్రబుద్ధుడు కేసు వేశాడు. సుదీర్ఘ విచారణ, చర్చల అనంతరం రష్యన్ న్యాయస్థానం కేసు కొట్టివేసింది. అంతేకాక, భగవద్గీత కర్తవ్యవిమూఢులకు కర్తవ్యపథం నిర్దేశిస్తున్నదని, విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చాలని ప్రబోధిస్తున్నదని కోర్టు పేర్కొంది.
భగవద్గీతలో మత చాంధసం కనపడదు. మత సంబంధమైన మకిలితనం భగవద్గీతలో కనిపించదు. మతబంధత, మతబంధనం, అజ్ఞానం, చాంధసత్వం ఏ కోణంలోనూ భగవద్గీతలో కానరావు. సంస్కృతీ సాంప్రదాయం, సనాతనత్వపు జ్ఞానం, ప్రజ్ఞానం, సుజ్ఞానం ప్రతి పదంలోన ద్యోతకమవుతాయి. ఇంతటి విశిష్టత, విలక్షణలతో కూడుతున్న మహాభాష్యాన్ని మరణసమయంలో పార్థివ దేహం ముందూ, అంతిమ యాత్రలోనూ వినిపించే శోకగీతంగా వ్యాఖ్యానంగా భగవద్గీతను పరిగణించడం, మార్చడం మన అజ్ఞానానికి చిహ్నంగా భావించాలి.
స్వ హతాన్ని, పర హతాన్ని బోధించి జీవితాలను పండించే వెలుగు భగవద్గీత. సంపూర్ణ సమగ్ర జీవన తత్వాన్ని అందించే పరిపూర్ణ ఆధ్యాత్మిక అనుభవాల ఆధునికత కలబోతల జ్ఞానాగ్నుల జిలుగు భగవద్గీత. గీత పారాయణాన్ని ఓ యజ్ఞంగా నిర్వహిద్దాం. గీతను అర్థం చేసుకుందాం. యజ్ఞ ప్రసాదాన్ని ఆరగిద్దాం..యజ్ఞ ఫలాన్ని అనుభవిద్దాం.





