News

క్రైస్తవం త్యజించి స్వధర్మంలోకి 2 కుటుంబాలు..టీటీడీకి అభ్యర్థన..

247views

రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు, క్రైస్తవ మత మార్పిడులు జరుగుతున్న తరుణంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని రెండు కుటుంబాలు క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టి సనాతన ధర్మాన్ని స్వీకరించాయి. అనంతపురం జిల్లా కుర్కుల తోట గ్రామంలో 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీటిలో చాలా వరకు హిందూ కుటుంబాలు ఉండగా రెండు క్రైస్తవ కుటుంబాలు కూడా ఇక్కడ నివసిస్తున్నాయి. అయితే వీరు ఎప్పటి నుంచో తమ స్వధర్మంలోకి రావాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే సనాతన ధర్మం కోసం పని చేస్తున్న ఒక సంస్థను వీరు సంప్రదించారు. హిందూ మతంలోకి తిరిగి రావాలనుకుంటున్నామని తమ అభిలాషను వ్యక్తం చేశారు.

పలు చర్చల అనంతరం గ్రామ పెద్దలతో సంప్రదింపుల తర్వాత సనాతన ధర్మం కోసం పని చేస్తున్న సంస్థ రెండు కుటుంబాలను తిరిగి హిందూమతంలోకి ఆహ్వానించింది. గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం ద్వారా రెండు కుటుంబాలకు సంప్రోక్షణ నిర్వహించి స్వధర్మంలోకి ఆహ్వానించడం జరిగింది. సనాతన వైదిక సంప్రదాయం ప్రకారం రెండు క్రైస్తవ కుటుంబాలు తిరిగి సనాతన ధర్మాన్ని ఆశ్రయించాయి. తమ మూలాలైన సనాతనానికి తిరిగి రావాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నామని తాజాగా తమ కల నెరవేరిందని స్వధర్మంలోకి వచ్చిన వారు తెలిపారు.

సనాతనధర్మంలోకి ఆహ్వానించే ఈ కార్యక్రమంలో క్రైస్తవ కుటుంబాలతో పాటు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భజన కార్యక్రమాలు, హోమం నిర్వహించారు. మరో విశేషం ఏంటంటే, తమ గ్రామం హిందూ గ్రామమంటూ ఊరి పొలిమేరల్లో బోర్డు ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాక, అన్యమతస్థులకు గ్రామంలో ప్రవేశం లేదని సైతం బోర్డులు ఏర్పాటు చేశారు. మొత్తంగా, క్రైస్తవ మత మార్పిడి పెద్ద సమస్యగా ఉన్న ప్రస్తుత వాతావరణంలో క్రైస్తవ కుటుంబాలు తిరిగి తమ స్వధర్మంలోకి రావడం నిజంగా విశేషమే. ఇకపోతే తమ గ్రామంలో హనుమంతుడి ఆలయాన్ని నిర్మించాలని గ్రామ ప్రజలు టీటీడీ బోర్డును అభ్యర్థిస్తున్నారు.