News

జ్ఞానవాపి కేసు..హిందూ, ముస్లింల గొడవేంటంటే..

291views

జ్ఞాన‌వాపి మ‌సీదు వివాదంపై అలహాబాదు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్ధరించాలంటూ హిందువులు వేసిన పిటీష‌న్లను స‌వాల్ చేస్తూ ముస్లింలు దాఖ‌లు చేసిన పిటీష‌న్లను అల‌హాబాద్ హైకోర్టు కొట్టిపారేసింది.

జ్ఞానవాపి మసీదుపై శాస్త్రీయ సర్వే చేపట్టాలని 2021 ఏప్రిల్‌ 8న వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ అంజుమన్‌ ఇంతిజామియా మస్జీద్‌ కమిటీ (ఎఐఎంసి), ఉత్తరప్రదేశ్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డులు పిటిషన్‌లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా మొత్తం హిందూ, ముస్లింలు చెరో అయిదు పిటీష‌న్లు దాఖ‌లు చేశారు. అయితే తాజాగా ముస్లింలు దాఖ‌లు చేసుకున్న అయిదు పిటీష‌న్లను తోసి పుచ్చింది. అలాగే ఈ కేసులో ఆరు నెల‌ల్లోనే విచార‌ణ‌ను పూర్తి చేయాల‌ని వార‌ణాసి కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1991 నాటి ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం ప్రకారం, 1947 ఆగష్టు 15కు ముందు మతపరమైన ప్రదేశాల స్వరూపాన్ని ఉనికిలో ఉన్నట్లుగా మార్చడాన్ని పరిమితం చేస్తుందని అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ కమిటీ, యూపి సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ వాదనలు వినిపించింది.

అసలేం జరిగింది :
మొఘల్ కాలంలో వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయ స్థానంలో జ్ఞానవాపి మసీదు నిర్మించారని, ఈ విషయంపై సర్వే నిర్వహించాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. 2021, ఏప్రిల్ 8న మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణం మొత్తం కార్బన్ డేటింగ్, ఇతర విధానాల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్నిఆదేశించింది. ఈ క్రమంలో చేసిన సర్వేలో ఓ శివలింగం ఆకారం బయటపడింది. అయితే, అది శివలింగం కాదని మసీదు నిర్వాహకులు వాదిస్తున్నారు. దీనిపై విచారించిన ధర్మాసనం ముస్లిం సంఘాల పిటిషన్లను కొట్టేయగా మసీదులో పూజలకు అనుమతించాల్సిందిగా హిందువులు చేస్తున్న డిమాండ్ పై విచారణ కొనసాగుతోంది.