News

భక్తిశ్రద్ధల మధ్య అనకాపల్లిలో జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభం

6views

 

అనకాపల్లి: జగన్నాథ స్వామి భక్తుల జయజయధ్వానాల మధ్య అనకాపల్లిలో జగన్నాథ స్వామివారి వార్షిక రథయాత్ర గురువారం ఘనంగా ప్రారంభమైంది. పట్టణంలోని అగ్గిమర్రి చెట్టు సమీపంలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి ఆలయం నుంచి రథయాత్రను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభించారు.

వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, “జై జగన్నాథ” నినాదాల మధ్య స్వామివారి రథం పురవీధుల్లో సాగింది. రథయాత్రలో పాల్గొనేందుకు అనకాపల్లి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.

ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 25వ తేదీ వరకు ఇంద్రజుమన్ హాల్‌లో జగన్నాథ స్వామివారికి ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం 25వ తేదీన తిరుగు రథయాత్ర వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా జగన్నాథ స్వామివారి రథయాత్ర విజయవంతంగా, శాంతియుతంగా సాగేందుకు ఆలయ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు విస్తృత ఏర్పాట్లు చేశారు.