
రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేదా…సర్కార్ అండ చూసుకొని అన్యమత ప్రచారం అడ్డు అదుపు లేకుండా సాగుతుందా..?? రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. అన్యమత ప్రచారానికి తోడు హిందూ ఆలయాలకు రక్షణ ఏమాత్రం లేదని తేటతెల్లం అవుతుంది. గడిచిన నాలుగేళ్లల్లో రమారమి 300లకు పైగా దేవాలయాలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. విగ్రహాలను ధ్వంసం చేశారు. రథాలను తగులబెట్టారు. హుండీలను పగలగొట్టి దోచుకున్నారు. ఆభరణాలను దొంగిలించారు. చివరకు పూజారులను కూడా హత్య చేశారు.
తిరుమల నుంచి శ్రీశైలం వరకు ప్రధాన హిందూ దేవాలయాల్లో ధర్మ విరుద్ద కార్యకలాపాలు యదేశ్ఛగా సాగుతున్నాయి. తిరుమలలో అన్యమత ప్రచార ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. టీటీడీ పరిధిలో ఉన్న చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలోని స్కంధ పుష్కరిణిలో మత మార్పిడుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటన మరువక ముందే తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ఎన్నడూ లేని విధంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో సెమీ క్రిస్మస్ వేడుకల కార్యక్రమాన్ని చేపట్టారు. యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్, పలువురు ఉద్యోగులు, విద్యార్థులు ఇందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు కూడా చేశారు.
యూనివర్సిటీల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం తప్పు కాదు అయితే ఎస్వీ యూనివర్సిటీకి లీడు కింద టీటీడీ వందలాది ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు అభివృద్ధి కోసం వార్షిక నిధులను కూడా చాలా ఏళ్లుగా మంజూరు చేస్తోంది. వర్సిటీలో నిర్వహించే పలు సదస్సులకు, పరిశోధనా ప్రాజెక్టులకు కూడా ఆర్థిక వనరులను సమకూరుస్తోంది. ఈ నేపథ్యంలో వర్సిటీ క్రిస్మస్ వేడుకలకు వేదిక కావడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఓవైపు మత ప్రచారం మరోవైపు హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం, ఆలయాల్లో చోరీ ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. తెనాలిలోని వైకుంఠపురం శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నలుగురు వ్యక్తులు చేతివాటం ప్రదర్శిస్తూ అడ్డంగా దొరికిపోయారు. అలాగే గుంతకల్లు నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలోని హుండీ దొంగతనంపై పలు అనుమానాలను రేకెత్తించింది. ఈ వ్యవహారం కంచే చేను మేసిందన్నట్లుగా ఉందని విమర్శలు ఉన్నాయి. ఇక తాజాగా నాగావళి తీరాన వెలసిన లతితాదేవి, చంద్రమౌళీశ్వర స్వామి ఆలయాల్లో దొంగలు చొరబడి బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. రెండు ఆలయాల్లో ఉన్న హుండీలను పగులగొట్టి నగదు, అమ్మవారి కిరీటం, బంగారం, వెండి ఆభరణాలు, చంద్రమౌళీశ్వర స్వామి నాగాభరణం, ధారాపాత్రను అపహరించుకుపోయారు. మొత్తం ఐదు తులాల బంగారం, ఏడు కిలోల వెండి దోచుకుపోయారు.

గతంలో చోరీలు జరిగాయి. కానీ, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో మాత్రం చోరీ ఘటనలకు అడ్డు అదుపులేకుండా ఉంది. హిందూ ఆలయాల ప్రాంగణంలో అన్యమత ప్రచార ఘటనలు సైతం నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇదంతా సర్కారు ఉదాసీనత వల్లే జరుగుతోందని హిందువులు బాహాటంగానే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు వరుస ఘటనలు చోటు చేసుకుంటుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఏదిఏమైనా ఆలయాల పరిరక్షణలో ప్రస్తుత ప్రభుత్వం విఫలం అయిందనే విమర్శలు జోరందుకుంటున్నాయి.





