News

అయోధ్య రామమందిరం గర్భగుడిని చూతమురారండి

384views

అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఆలయ గర్భగుడి ఫోటోలను రామ్ మందిర్ ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్‌ ట్విట్టర్‌(ఎక్స్‌)లో ఫొటోలు పోస్ట్‌ చేశారు. ఇదిలా ఉంటే, వేద మంత్రాల నడుమ కన్నుల పండువగా జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. ఆయనతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ జీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి దేశంలోని 8వేల మంది ప్రముఖులను కూడా ఆహ్వానిస్తన్నారు. ఆ జాబితాలో సినీరంగం నుంచి అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్‌తో పాటు ఇతర ప్రముఖులు.. అలాగే పారిశ్రామిక రంగం నుంచి రతన్ టాటా, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ లాంటి ప్రముఖులు, భారత్ క్రికెట్ రూపురేఖలు మార్చిన దిగ్గజ క్రికెటర్లలో సచిన్, విరాట్ కోహ్లి లాంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది.

అలాగే పూజారులు, దాతలు సహా దేశంలోని పలువురు రాజకీయ నాయకులు సహా దాదాపుగా 8వేల మందికి ఈ ఆహ్వానాలు అందినట్టు తెలుస్తోంది. ఆహ్వానం అందుకున్న వారిలో పలువురు జర్నలిస్టులు, మాజీ ఆర్మీ అధికారులు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు, పద్మ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 50 మంది కరసేవకుల కుటుంబాలకు కూడా ఆహ్వానం పంపించారు. మరోవైపు రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2024లో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణాలను నిర్వహించనున్నారు.

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని సందర్శించే భక్తులు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జన్మభూమి కాంప్లెక్స్‌లో మరో 7 ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇదిలా ఉంటే అయోధ్య రామమందిరం ఉత్సవానికి వచ్చే భక్తులకోసం అయోధ్య అభివృద్ధి సంస్థ టెంట్‌లను నిర్మించింది. ఓ ప్రైవేటు సంస్థతో కలిసి జర్మన్‌ టెక్నాలజీతో దాదాపు 30వాటర్‌ ప్రూఫ్‌ టెంట్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. రామాలయ ప్రారంభోత్సవానికి దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఈ టెంట్‌లను సిద్ధం చేసినట్లు తెలిపింది. అయితే వాటికోసం ముందుగానే బుక్‌ చేసుకోవాలని సూచించింది.