
ఓ యుద్ధంలో మరాఠా పాలకులు అవలంబించిన వ్యూహాలనే అమలు చేసి.. ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్‌ను ఆర్థర్ వెల్లస్లీ నేతృత్వంలోని బ్రిటీష్ బలగాలు ఓడించినట్లు బ్రిటన్‌కు చెందిన ఓ మాజీ సైన్యాధికారి వెల్లడించారు. 1815 వాటర్లూ యుద్ధంలో ఇది జరిగిందన్నారు. బ్రిటన్‌కు చెందిన మాజీ సైన్యాధికారి మేజర్ గోర్డాన్ కొరిగన్ గురువారం తన బృందంతో కలిసి మహారాష్ట్ర అకోలా జిల్లాలోని సిర్సోలీ గ్రామాన్ని సందర్శించారు. 1803లో ఇక్కడే మరాఠా పాలకులు, ఆంగ్లేయుల మధ్య అర్గావ్ యుద్ధం జరిగింది.
ఆర్థర్ వెల్లస్లీ సమక్షంలో, కెప్టెన్ కేన్ ఆధ్వర్యంలో బ్రిటీష్ దళాలు 1803 నవంబర్‌లో మరాఠాలతో పోరాడాయి. మరాఠా దళాలకు నాగ్‌పుర్కర్ భోంస్లే నాయకత్వం వహించారు. ఈ క్రమంలోనే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా మరాఠా సైనికులు తమదైన వ్యూహాలు, సాంప్రదాయ ఆయుధాలతో విరుచుకుపడ్డారు. మరాఠా సైన్యానికి చెందిన కర్తాజీరావు జైలే చేతిలో కెప్టెన్ కేన్ హతమయ్యాడు. ఈ యుద్ధంలో దారుణంగా దెబ్బతిన్న బ్రిటీషర్లు చివరకు విజయం సాధించారు. అనంతరం ఆర్థర్ వెల్లస్లీ ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. 1815లో జరిగిన వాటర్లూ యుద్ధంలోనూ బ్రిటీష్ దళాలను నడిపించి నెపోలియన్‌ను ఓడించాడు.
ఆ యుద్ధానికి సంబంధించిన వివిధ అంశాలను అధ్యయనం చేయడంతోపాటు అందులో ప్రాణాలు కోల్పోయిన తమ సైనికులకు నివాళులు అర్పించేందుకుగానూ గోర్డాన్ కొరిగన్ బృందం సిర్సోలీ చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సిర్సోలీలో మరాఠాలు అనుసరించిన వ్యూహాలనే ఆర్థర్ వెల్లస్లీ ఉపయోగించి.. వాటర్లూ యుద్ధంలో నెపోలియన్‌ను ఓడించాడు. సిర్సోలీ యుద్ధం, అందులో మరాఠాలు అమలు చేసిన వ్యూహాలను వెల్లస్లీ తన పుస్తకాల్లోనూ ప్రస్తావించారు’ అని చెప్పారు. ఇదిలా ఉండగా.. గత 220 సంవత్సరాలుగా బ్రిటిష్ పౌరులు ఏటా నవంబర్‌లో సిర్సోలీని సందర్శిస్తుంటారు.





