ArticlesNews

సార్వజనీనం గురు నానక్ సందేశం

331views

(నవంబర్ 27 – గురునానక్ జయంతి)

‘నేను మనుషులను మాత్రమే చూస్తున్నాను. అతడు ధరించిన మతపరమైన దుస్తులు, విశ్వాసాలతో నిమిత్తంలేదు’ అన్న గురునానక్‌ ‌మానవతావాదానికి, పరమత సమాదరణకు ప్రతీక. గురుశిష్య సంబంధాలను పటిష్ఠ పరుస్తూ సర్వమానవ సమానత్వం, ప్రేమతత్వాన్ని పెంపొందించేలా సిక్కు ధర్మాన్ని ప్రతిపాదించారు. ఆయన రూపొందించిన జీవన విధానం సర్వ సమ్మతమై గురుగోవింద సింగ్‌ ‌వరకు పదిమంది గురువుల నేతృత్వంలో వికసించింది. నేటికి వర్థిల్లుతోంది. నానాక్షహి క్యాలెండర్ ప్రకారం గురునానక్ దేవ్ జీ 1469 ఏప్రిల్ 15న జన్మించారు. హిందూ క్యాలెండర్ ప్రకారం దీపావళి అనంతరం 15 రోజుల తర్వాత కార్తీక మాసంలో పదిహేనవ చాంద్రమాన దినమైన కార్తిక పూర్ణిమ రోజున గురుపూరబ్ జరుపుకుంటారు. ఈ సంవత్సరం పండుగను నవంబర్ 27న జరుపుకుంటున్నాము.

గురునానక్ జీ ఐదేళ్ల వయస్సు నుంచే నిరంతరం దైవ నామస్మరణ చేస్తుండేవారట. చిన్నతనం నుంచి ప్రశ్నించి, ఆలోచించే తత్త్వం కలిగిన ఆయన హిందూమతంలోని తాత్త్త్వికత పట్ల ఆకర్షితులై జీవిత రహస్యాల అన్వేషణకు ఇల్లు వదలివెళ్లారు. హిందూ-ముస్లిం గురువుల వద్ద చదువుకున్న ఆయన స్వమతంతో పాటు ఇస్లామియా మత గ్రంథాలను అధ్యయనం చేశారు. రెండు మతాల ఆధ్యాత్మిక విషయాల పట్ల లోతైన అవగాహన సాధించారు. లోకంలోని మూఢాచారాలను మతం పేరిట జరిగే అనాచారాలుగా భావించి వాటిని వ్యతిరేకించారు. ఇరు మతాలలోని మంచిని, దాని ఆచరణలోని లోపాలను గమనించి సరళమైన ధోరణిలో ఆధ్యాత్మికత ప్రబోధానికి ఉపక్రమించారు. అలా ప్రజల భాషలో చేస్తున్న ధర్మప్రచారంతో ప్రభావితులైన వారు తమలోని లోపాలను సరిదిద్దుకునే వారట. అలా ఆయనను అనుసరించిన వారిని సిక్కులుగా వ్యవహరించసాగారు.

ఎక్కడో ఉన్న దేవుడి కంటే మనిషిలోని మానవత్వమే మిన్న అనే కోణంలో సామాజిక బాధ్యతను ఆధ్యాత్మికతో ముడిపెట్టి బోధించారు నానక్‌. ‘ఓంకారం మాదిరిగా భగవంతుడు ఒక్కడే. ఆయన సర్వాంతర్యామి. జీవకోటికి తండ్రిలాంటివాడు. అందరిలో, అన్నిటిలో పరమాత్ముని చూడగలినవారే భగవత్‌ ‌కృపకు పాత్రులవుతారు. దేవుడు బాహ్యాచారాల వల్ల కాకుండా మానసిక సాధన ద్వారానే ప్రీతిచెందుతాడు. అహం, గర్వం, కోరికలు వదిలి అందరితో ప్రేమపూర్వకంగా మెలగాలి. సమభావం కలిగి ఉండాలి’ అని ప్రబోధించారు నానక్‌.

‌నానక్‌ ‌తండ్రి మెహతా కాలూచంద్‌ ‌ఖత్రీ,తల్లి తృప్తాదేవి. బీబీ నాన్కీ అనే అక్క. ఆమె అత్యంత పిన్నవయస్సులోనే తమ్ముడిలో దైవత్వాన్ని చూడగలిగారు. అప్పట్లో ఆమె దీనిని బహిర్గతం చేయకపోయినా, అనంతర కాలంలో గురునానక్‌జీ తొలి శిష్యురాలిగా పేరుపొందారు. 28 ఏళ్ల వయస్సులో ఒక రోజు ఉదయం నదీస్నానం, ధ్యానానికి వెళ్లిన నానక్‌ ‌గురించి మూడు రోజుల వరకు జాడలేదు. తిరిగి వచ్చాక ‘దేవుని పవిత్రాత్మను నింపుకున్నాను’ అని ప్రకటించారు. ఆ కాలంలో హిందూ-ముస్లిం ధర్మాల మధ్య ఘర్షణలు, కొట్లాటలు చెలరేగుతుండేవి. ఆ నేపథ్యంలో ‘లోకంలో ఆ రెండు మతాల వారు లేనేలేరు. కుల మత వర్ణ వర్గ ధనికపేద ప్రాంత భేదాలు లేవు. ఉన్నదంతా మానవత, సమత, మమత. అవే మన అభిమతం కావాలి. వాటిని ప్రబోధించేందుకే నేనీ లోకానికి వచ్చాను’ అని ప్రకటించారు. కేవలం మాటలతో మతం లేదని, మానవులందరినీ సమంగా చూసేవాడే భక్తిపరుడని, తోటివారి ప్రేమను పొందకలిగిన వారే భగవంతుడిని చూడగలరని గురు నానక్ జీ ప్రబోధించారు.

మతసామరస్యాన్ని ప్రబోధించేందుకు గురు నానక్ జీ నాలుగుసార్లు ప్రపంచ యాత్రలు చేశారు. వీటిని ‘ఉదాసీ’ యాత్రలు అంటారు. సిక్కుల ఐదవ గురువు అర్జున్‌ ‌తన పూర్వ గురువులు అనుగ్రహించిన సూక్తులను, బోధనలను ‘గురు గ్రంథ సాహిబ్‌’‌గా సంకలనం చేశారు. అందులో దాదాపు ఐదున్నర శతాబ్దాల కిందట గురునానక్‌ ‌చేసిన బోధనలు, సూక్తులు నిత్యసత్యాలని, దాదాపు ప్రతి మానవుడు ఆచరించదగినవని సార్వజనీనం, సర్వకాలీనం అనిపిస్తాయి. ప్రతికాలానికి వర్తించేలా ఉంటాయి. కష్టించి, న్యాయమార్గంలోనే ధనాన్ని ఆర్జించాలి. నిజాయితీగా ఆర్జిస్తూ అవసరార్థులను ఆదుకోవాలని నానక్‌ ‌బోధించారు. పనిచేసే వాడికే తినే హక్కు ఉంటుందని ఆనాడే చెప్పారు. సమాజంలో పేరున్నా పొలాల పనిచేస్తూ జీవనం సాగించి అందరికి ఆదర్శంగా నిలిచారు. గురుద్వార్‌లలో నేలను తుడవడం, పాత్రలను శుభ్రపరచడం, నీటిని వంట గదికి చేర్చడం వంటివాటిని సేవా కార్యక్రమాలుగా గురునానక్‌ ‌ప్రారంభించారు. లోభత్వాన్ని తరిమికొట్టాలి అంటూ కుల, మత, ధనిక, పేద అంశాలకు అతీతంగా ఆహారాన్ని పంచుకునేవారు. ఇతరుల హక్కులకు భంగం కలిగించకూడదని, స్త్రీపురుషులు సమానులేనని ముఖ్యంగా మహిళలను గౌరవించాలని ఉపదేశించారు. ‘సంపాదన అవసరమే కానీ సంపాదనే పరమార్థం కాదు. అక్రమ ఆర్జన అరిష్టదాయకం. ముఖ్యంగా సమాజ హితాన్నికాదని దోచుకొని దాచుకోవడం సరికాదు. డబ్బు జేబుకే పరిమితం కావాలి తప్ప హృదయానికి తాకకూడదు. అలా జరిగితే అనేక సమస్యలు చుట్టుముడతాయి. మానసిక వ్యాకులతను పక్కనపెట్టి నిత్యం ప్రసన్నంగా ఉండాలి’ అన్న నానక్‌జీ నాటి పలుకులలోని వాతావరణం నేటి సమాజ పోకడలో కనిపించకమానదు