ArticlesNews

పోరాట యోధుడు, సనాతన ధర్మ పరిరక్షకుడు లచిత్ బర్ఫుకన్

540views

( నవంబర్ 24 – లచిత్ బర్ఫుకన్‌ జయంతి )

మొఘలుల సామ్రాజ్య కాంక్షను, వారి దాష్టికాలను ఎదిరించిన భారతమాత ముద్దుబిడ్డలు ఎందరో. మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ, రాజ్‌పుత్ రాజు బందా బహదూర్, రాజా ఛత్రపాల్ వంటి యోధుల కోవకు చెందినవారే వీర లచిత్ బర్ఫుకన్. 1671లో సరాయ్ ఘాట్ యుద్ధంలో రాజా రాంసింగ్ నేతృత్వంలోని అసంఖ్యాక మొఘల్ సేనను అప్రతిహతంగా ఎదుర్కొని వారిని అహోం రాజ్యం నుంచి తరిమికొట్టిన వీరుడు. లచిత్ బర్ఫుకన్ నేడు అస్సాంగా పిలవబడుతున్న ఒకనాటి అహోం రాజ్యంలో 17వ శతాబ్దంలో జన్మించారు. అతని అసలు పేరు లచిత్ డెకా. లచిత్ తన చిన్ననాటి నుంచే సర్వ సైన్యాధికారి అయిన తండ్రి మొమై తములి బోర్బరువా సారధ్యంలో సైనిక శిక్షణ పొందారు. అహోం రాజు జయధ్వజ సింఘా వద్ద సోలాధర బారువాగా ఉన్న లచిత్ అంచెలంచెలుగా ఎదిగి చక్రధ్వజ హయాంలో బర్ఫుకన్‌గా ఎదిగారు. అలా లచిత్ డెకా కాలక్రమేణా లచిత్ బర్ఫుకన్‌గా ప్రసిద్ధి చెందారు.

మొహమ్మద్ ఘోరి కాలం నుండి ముస్లిం రాజులు అహోం రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అహోం రాజులు వీరోచిత పోరాట పటిమతో వాటన్నింటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మరాఠా రాజ్యాన్ని మినహా భారతదేశాన్నంతా ఆక్రమించిన మొఘలులు అహోం రాజ్యాన్ని ఆక్రమించడానికి, తమ రాజ్యాన్ని తూర్పు వైపు విస్తరించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అహోం రాజ్యంలోని అంతర్గత కలహాలను ఆసరాగా చేసుకొని గౌహతిని ఆక్రమించారు. ఆహోం రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించటానికి మొఘలుల సేనలు రాజా రాంసింగ్ నేతృత్వంలో 1671లో బ్రహ్మపుత్ర నది తీరంలో సరాయిఘట్‌లో మోహరించాయి. ఈ యుద్ధంలో లచిత్ తన సేనాలను ముందుండి నడిపించడమే కాకుండా మొఘల్ సైన్యాన్ని చిత్తుగా ఓడించారు.

లచిత్ బర్ఫుకన్ ముందుండి పోరాటానికి నాయకత్వం వహించడమే కాక ప్రతి పోరాటంలో మొఘలులను ఓడించాడు. తన సైనిక పరాక్రమంతో అస్సాం సరిహద్దుల్లో కూడా మొఘల్ సైన్యం ఆనవాళ్లు లేకుండా వారిని వెళ్లగొట్టాడు. మొఘల్ సైన్యాధికారి రాజారామ్ సింగ్ తన విరోధి పోరాటపటిమకు విస్మయం చెందడమే కాక ఆయనను ఓడించడానికి ఆయన యుద్ధ ప్రణాళికలో ఎటువంటి లొసుగులు, అవకాశాలు కనిపించలేదని లచిత్‌ను ప్రశంసించాడు. గౌహతి రాజభవనంపైన అహోం జెండాను తిరిగి స్థాపించిన లచిత్ ఘనత, విశిష్టత అటువంటిది.

సరైఘాట్‌లో నిర్ణయాత్మక యుద్ధం జరిగిన సంవత్సరం తరువాత 1672 ఏప్రిల్‌లో లచిత్ తన కాలిబోర్ ప్రధాన కార్యాలయంలో వీరమరణం పొందారు. ప్రాణం కన్నా దేశమే మిన్న అనే విధంగా అసాధారణమైన వీరత్వం ప్రదర్శించిన లచిత్ బర్ఫుకన్ తరతరాల అస్సామీలకు ప్రేరణ. ధైర్యంగా పోరాడటానికి, ఓటమి అంచునుండి గెలవటానికి, అస్సాంలోని అన్ని వర్గాల ప్రజలు లచిత్ పేరును స్మరించుకుంటారు. హూలంగాపారాలో మహారాజు ఉదయాదిత్య సింగ్ నిర్మించిన లచిత్ మైదానంలో 1672లో లచిత్‌కు తుది విశ్రాంతి కల్పించారు. ఆయన విగ్రహాన్ని 2000 సంవత్సరంలో అప్పటి అసోం గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్‌కే. సిన్హా…ఖడక్‌వాస్లాలోని జాతీయ డిఫెన్స్ అకాడమీలో ఆవిష్కరించారు. ప్రతి ఏడాది పాస్ అవుట్ అయ్యే అత్యుత్తమ క్యాడెట్‌కు లచిత్ పతకాన్ని బహుకరిస్తారు. మొఘలులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడడమే కాకుండా, సనాతన ధర్మాన్ని రక్షించడంలో ముఖ్య పాత్ర పోషించిన భరతమాత ముద్దుబిడ్డ లచిన్ బర్ఫుకన్‌ను గుర్తు తెచ్చుకునేందుకు ప్రతి నవంబర్ 24న లచిత్ దివస్‌గా జరుపుకుంటున్నాము. ధైర్యం, రాజనీతజ్ఞతకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచే లచిత్ బర్ఫుకన్ సదా స్ఫూర్తిదాయకం.