
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో రేపటి నుంచి విశ్వ హిందూ కాంగ్రెస్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.వరల్డ్ హిందూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జయస్య ఆయత్నం ధర్మః , అంటే “ధర్మం, విజయానికి నిలయం” అనే ఇతివృత్తంతో 2023 WHC సమావేశాలు జరుగుతాయి.
వ్యాపారం, ఆర్థిక వ్యవస్థ , విద్యా సంస్థలు, మీడియా, రాజకీయాలు, మహిళలు మరియు యువతకు సంబంధించిన 7 సమకాలీన అంశాలపై సమావేశాల్లో చర్చించనున్నారు. ప్రతీ యేటా జరిగే ఈ సదస్సు ఈ నెల 24 నుంచి 26 వరకు జరుగుతుంది. బ్యాంకాక్‌లోని ఇంపాక్ట్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ సదస్సు జరగనుంది.
కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చలాక్ డాక్టర్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబాలే, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే హిందూ ప్రముఖులు పాల్గొననున్నారు. 60 కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సులో తమ అభిప్రాయాలను తెలపనున్నారు.
హిందూ మతం పట్ల ప్రేరణ కల్గించడంతో పాటు హిందూ సమాజ సంక్షేమం కోసం కలిసి పనిచేయడానికి ఒక సమగ్ర వేదికను వరల్డ్ హిందూ కాంగ్రెస్ అందింస్తుంది. అలాగే సనాతాన ధర్మం పట్ల మన విధులు, బాధ్యతలను నెరవేర్చడానికి స్ఫూర్తినిస్తుంది.





