
( నవంబర్ 23 – జగదీష్ చంద్రబోస్ వర్ధంతి )
మన దేశం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నప్పుడు పలువురు విద్యావంతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొని వివిధ రంగాల్లో పరిశోధనలు చేశారు. అటువంటి వారిలో జగదీష్ చంద్రబోస్ ఒకరు.బ్రిటిష్ ఇండియాలో బెంగాల్ ప్రావిన్సులో 1858 నవంబర్ 30న జన్మించిన బోసు కలకత్తా లోని సెయింట్ జేవియర్ కళాశాల నుంచి డిగ్రీ పుచ్చుకున్నారు. తరువాత ఆయన వైద్య విద్య కోసం లండన్ వెళ్ళారు. కానీ ఆరోగ్య సమస్యల వలన చదువును కొనపోయారు. తిరిగి భారతదేశానికి వచ్చి కోల్‌కత లోని ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్ర ఆచార్యుడిగా చేరారు. అక్కడ జాతి వివక్ష రాజ్యమేలుతున్నా, చాలినన్ని నిధులు, సరైన సౌకర్యాలు లేకపోయినా తన పరిశోధనను కొనసాగించారు.
జగదీశ్ చంద్రబోస్ అనేక విద్యలను అభ్యసించాడు. వైద్యము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, పురావస్తు శాస్త్రములలో పారంగతుడే కాక సైన్సు కథలను రాయడంలో బోస్ సిద్ధహస్తుడు. రేడియో సూక్ష్మ తరంగాల మీద పరిశోధనలు చేశాడు. రేడియో ఆవిష్కరణ మీద బోస్‌కు నోబుల్ ప్రైజ్ రావలసి ఉన్నా మార్కోనీకిచ్చి బేధాభావం చూపారంటారు. జగదీష్ చంద్ర బోస్ వైర్‌లెస్ సిగ్నలింగ్ పరిశోధనలో అద్భుతమైన ప్రగతిని సాధించారు. రేడియో సిగ్నల్స్ ను గుర్తించడానికి అర్థవాహక జంక్షన్ లను మొట్టమొదటి సారిగా వాడింది బోసే. కానీ తన పరిశోధనలను వ్యాపారాత్మక ప్రయోజనాలకు వాడుకోకుండా తన పరిశోధనల ఆధారంగా ఇతర శాస్త్రవేత్తల మరిన్ని ఆవిష్కరణలకు దారి తీయాలనే ఉద్దేశంతో బహిర్గతం చేశారు.
బోసు వృక్ష భౌతిక శాస్త్రంలో కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు. తాను రూపొందించిన పరికరం క్రెస్కోగ్రాఫ్ను ఉపయోగించి వివిధ రకాలైన పరిస్థితుల్లో మొక్కలు ఎలా స్పందిస్తాయో పరిశోధనాత్మకంగా నిరూపించారు. తద్వారా జంతువుల, వృక్షాల కణజాలాలలో సమాంతర ఆవిష్కరణలు చేశారు.వృక్షశాస్త్రం మీద బోస్ చేసిన యోగదానం బహు మూల్యమైనది. అతని ప్రతిభను గుర్తించి చంద్రుని మీద ఒక శిఖర బిలానికి (క్రేటల్) అతని పేరు పెట్టారు. అప్పట్లో తాను కనిపెట్టిన ఆవిష్కరణకు సన్నిహితుల ప్రోధ్బలంతో ఒక దానికి పేటెంట్ కోసం ఫైల్ చేసినప్పటికీ, ఆయనకు పేటెంట్లంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు.
బోసుకు మాతృభాష బెంగాలీ అంటే చాలా ఇష్టం. అదే సమయంలో ఆంగ్ల భాషపై కూడా ఆయన మంచిపట్టుసంపాదించారు.బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు పొందారు.1937 నవంబర్ 23న తుదిశ్వాస విడిచారు.జగదీశ్ చంద్రబోస్ తన ప్రయోగాలను అనుభవాలను యూనిట్ ఆఫ్ లైఫ్, వాయిస్ ఆఫ్ వైఫ్ అనే వ్యాస సంపుటాల ద్వారా వివరించారు. పశు పక్ష్యాదులలో, క్రమికీటకాలలోనే కాదు సమస్త జగత్తులోనూ ఒకే ఆత్మ ఉందనే మన ప్రాచీన మహర్షుల అమృత వచనాలను నిరూపించిన ఆధునిక మహర్షి జగదీశ్ చంద్రబోస్.




