News

ఇజ్రాయిల్ – హమాస్ ఒప్పందంలో భారత్ సాయం కోరనున్న ఇస్లామిక్ దేశాలు

285views

ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం, సంధి కోసం ఇస్లామిక్ దేశాలతో పాటు ప్రపంచ దేశాలు పిలుపునిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంధి కోసం భారత్ సాయం కోరేందుకు ఇస్లామిక్ దేశాల ప్రతినిధి బృందం భారత్ ను సందర్శించనున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, జోర్డాన్, పాలస్తీనా, ఇండోనేషియా విదేశాంగ మంత్రులతో కూడిన ప్రతినిధి బృందంతో పాటు ఐఓసీ జనరల్ సెక్రటరీ గాజాపై చర్చించడానికి భారతదేశాన్ని సందర్శించనున్నట్లు తెలిసింది. గాజా సంక్షోభంపై చొరవ తీసుకునేందుకు రియాద్‌లో ఏర్పాటు చేసిన అరబ్, ఇస్లామిక్ దేశాలకు చెందిన ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం భారత్‌తో పాటు P5 దేశాలను సందర్శించనున్నారు.

అయితే ఇప్పటి వరకు వారి తేదీలు ఖరారు కాలేదు. ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, జోర్డాన్, పాలస్తీనా, ఇండోనేషియా విదేశాంగ మంత్రులు మరియు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) ప్రధాన కార్యదర్శి ప్రతినిధి బృందంలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితిలోని శాశ్వత సభ్యదేశాలైన యూఎస్, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలను పీ5 దేశాలుగా పిలుస్తారు. కాల్పుల విరమణ, గాజాపై శతృత్వానని వీడేలా ఇజ్రాయిల్‌ని ఒప్పించాలనీ పీ5 దేశాలతో పాటు ఇండియాను కోరనున్నారు.