News

ఈ నెల 15 నుంచి విజయవాడ దుర్గగుడి దసరా ఉత్సవాలు

276views

ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. తొలి రోజు 15న దుర్గమ్మను బాలా త్రిపుర సుందరీ దేవిగా, 16న గాయత్రీదేవిగా, 17న అన్నపూర్ణాదేవిగా, 18న మహాలక్ష్మిగా, 19న మహా చండీదేవిగా, 20న సరస్వతీదేవిగా 21న లలితా త్రిపుర సుందరిగా, 22న దుర్గాదేవిగా, 23 ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహిషాసుర మర్ధినిగా, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 గంటల వరకు రాజరాజేశ్వరీదేవిగా అలంకరిస్తారని పేర్కొన్నారు.

15న తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ తరువాత ఉదయం 9 గంటలకు దర్శనానికి క్యూలైన్లో భక్తులను అనుమతిస్తారన్నారు. ఉదయం 9 గంటలకు గణపతి పూజ నవరాత్రి కలశ ప్రతిష్ఠాపన, మహామండపం ఆరో అంతస్తులో కుంకుమార్చన, శ్రీచక్రనవావరణార్చన, యాగశాలలో చండీహోమం నిర్వహిస్తారన్నారు. మిగతా రోజుల్లో తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారన్నారు.

15 నుంచి 22 వరకు సాయంత్రం 4 గంటలకు గంగా, పార్వతీ సమేత దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులతో నగరోత్సవాన్ని నిర్వహిస్తారని పేర్కొన్నారు. 20న మూలానక్షత్రాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి సమర్పిస్తారని తెలిపారు. 21న మహామండపం ఆరో అంతస్తులో సాయంత్రం 5గంటలకు అర్చక సభ, 22న సాయంత్రం 5గంటలకు వేదవిద్వత్‌, పండిత సత్కారం నిర్వహిస్తామన్నారు. 23న ఉదయం 10.30గంటలకు యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయని ఈఓ వివరించారు. సాయంత్రం 6 గంటలకు కృష్ణానదీ తీరాన దుర్గాఘాట్‌లో ఆదిదంపతులను హంసవాహనంపై ఉంచి జలవిహార కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.