News

భారత దౌత్యవేత్త గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డుకున్న సిక్కు ఆందోళనకారులు

299views

స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో గురుద్వారా దగ్గర భారత దౌత్యవేత్తను సిక్కు ఆందోళనకారులు అడ్డుకున్న ఘటనపై భారత ప్రభుత్వం బ్రిటన్ విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసింది.

స్థానిక సిక్కుల సమస్యలు, ఇతర వ్యవహారాల గురించి చర్చించేందుకు విక్రమ్ దొరైస్వామిని గురుద్వారా వద్దకు ఆహ్వనించారని, అయితే అక్కడికి వెళ్లాక ఆయనను కొంతమంది ఆందోళనకారులు అడ్డుకోవడంతో వెనుదిరగాల్సి వచ్చిందని భారత హైకమిషన్ తెలిపింది.

బ్రిటన్‌లో భారత హై కమిషనర్‌గా ఉన్న విక్రమ్ దొరైస్వామి స్కాట్లాండ్‌లోని అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే గ్లాస్గో సంఘటన జరిగింది.గ్లాస్గోలోని అల్బర్ట్ డ్రైవ్ ప్రాంతంలో ఆయన కారు ఆగగానే ముగ్గురు సిక్కు కార్యకర్తలు కారు దగ్గరకు వెళుతున్న దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఆందోళనకారుల్లో ఒకరు ఆయన కారు డోరు తీసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన లోపలే కూర్చుని ఉండటం కనిపిస్తోంది.“మీరు వెళ్లిపోవడం మంచిది” అని మరో ఆందోళనకారుడు ఆయనతో చెప్పారు.దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

గురుద్వారాను భారతీయ అధికారులు సందర్శించడంపై చాలా కాలంగా నిషేధం ఉందని సిక్కు గ్రూప్ ఒకటి తర్వాత ప్రకటించింది. సిక్కు ఆందోళనకారులు అడ్డుకున్న ఘటనపై భారత ప్రభుత్వం బ్రిటన్ విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసింది.