
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రేక్ దర్శనం టికెట్ల కొనుగోలుతో పాటు గదుల బుకింగ్ సమయంలో డబ్బు చెల్లించే విధానాలను సులభతరం చేస్తూ తితిదే మార్పులు చేస్తోంది. ఇందుకు‘పేలింక్’ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సొమ్ము బదిలీ చేసే విధానాలను విస్తరిస్తోంది. ప్రస్తుతం తిరుమలలోని సీఆర్వోలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను లక్కీ డిప్‌లో కేటాయిస్తుండగా, భక్తులు పేలింక్ ద్వారా సొమ్ము బదిలీ చేస్తున్నారు. యాత్రికులు ప్రత్యక్షంగా కౌంటర్ వద్దకు వచ్చి టికెట్లు కొనాల్సిన ప్రయాస తప్పింది. ఇదే విధానాన్ని ఇకపై వీఐపీ బ్రేక్ దర్శనం, విచక్షణ కోటా ఆర్జిత సేవలు, సీఆర్వో పరిధిలోని గదుల కేటాయింపునకూ వర్తింపజేయాలని తితిదే ఐటీ శాఖ యోచిస్తోంది.
ఆఫ్‌లైన్‌లో గదుల కేటాయింపునకూ ఇదే పద్ధతిని పరిశీలిస్తున్నట్లు ఈడీపీ విభాగం సీఈవో సందీప్‌రెడ్డి తెలిపారు. భక్తులు సీఆర్వోలో ఆధార్, సెల్‌ఫోన్ నంబర్లు ఇస్తే, గదుల లభ్యతను బట్టి ఆ ఫోన్‌నంబర్‌కు గదిని కేటాయిస్తూ పే లింక్ ఎస్‌ఎంఎస్ పంపిస్తారు. ఆన్‌లైన్‌లోనే గది అద్దె, కాషన్ డిపాజిట్ చెల్లించవచ్చు. తద్వారా విచారణ కార్యాలయాల వద్ద రద్దీని తగ్గించవచ్చని చెబుతున్నారు. ఈ మార్పులపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు సందీప్‌రెడ్డి వెల్లడించారు.




