News

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల సత్తా ; 50 దాటిన పతకాల సంఖ్య

234views

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తాచాటుతున్నారు. చరిత్రను తిరగరాస్తూ.. రికార్డులు నమోదు చేస్తూ పతకాల వేటలో దూసుకెళ్తున్నారు. అవినాష్‌ సాబ్లే, తజిందర్‌ సింగ్‌ పసిడి పట్టగా.. ‘లక్ష్య’ అథ్లెట్‌ అగసర నందిని కాంస్యంతో మెరిసింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి రజతాన్ని ముద్దాడింది. వెరసి ఆదివారం అథ్లెటిక్స్‌లోనే రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలు వచ్చాయి. మరోవైపు షూటర్లు అద్భుత ప్రదర్శన కొనసాగించి.. ఓ స్వర్ణం, రజతం, కాంస్యం గెలిచి.. ఓవరాల్‌గా 22 పతకాలతో ఆసియా క్రీడల చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనతో పోటీలు ముగించారు.అటు గోల్ఫ్‌లో అదితి రజతం సాధించగా.. ఇటు బ్యాడ్మింటన్‌లో జట్టు వెండి పతకం నెగ్గింది. మొత్తంగా ఎనిమిదో రోజు 3 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు దక్కాయి. ఆసియా క్రీడల్లో భారత్‌ ఒక్క రోజే 15 పతకాలు సాధించింది. దీంతో పతకాల సంఖ్య 50 దాటింది.

చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ జ్యోతి యర్రాజి

ఆసియా క్రీడల మహిళల 100మీ. హార్డిల్స్‌లో పతకం నెగ్గిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచింది. నాటకీయ పరిణామాల మధ్య ముగిసిన రేసులో ఆమె రజతం సొంతం చేసుకుంది. 12.91 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని పొందింది. లిన్‌ యువీ (చైనా- 12.74సె) స్వర్ణం, తనాక (జపాన్‌- 13.04సె) కాంస్యం సొంతం చేసుకున్నారు.