
చరిత్ర ఎప్పటికీ వాస్తవాల్నే ప్రతిబింబించాలి. అది మంచి అయినా, చెడు అయినా! ఈ విషయంలో ఏ దేశానికీ మినహాయింపు ఉండదు. చరిత్ర వక్రీకరణకు గురైతే భావి తరాలు గందరగోళంలో పడే ప్రమాదం ఉంది. ఏది వాస్తవం, ఏది అవాస్తవమో నిర్ణయించుకోలేని స్థితిలో పడిపోతారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే రాజస్థాన్‌లో ఎదురవుతోంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా చరిత్ర పాఠ్యాంశాలు మారిపోతున్నాయి. దీంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. రాజస్థాన్‌లో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అధికారంలోకి రాగానే ‘పాఠ్యపుస్తకాల రివిజన్ కమిటీ’ని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ సూచనల మేరకు పదవ తరగతి సాంఘిక శాస్త్రంలోని వీర్ సావర్కర్ జీవిత చరిత్ర పాఠ్యాంశంలో కొన్ని మార్పులు చేసింది. ఆయన పేరు ముందు ‘వీర్’ పదాన్ని తొలగించాలని సిఫార్సు చేసింది. అంతేకాకుండా మహాత్మాగాంధీని హత్య చేసేందుకు వినాయక్ దామోదర్ సావర్కర్ కుట్ర పన్నారనీ, అప్పటి బ్రిటిష్ పాలకులకు ఆయన క్షమాపణ చెప్పి జైలుశిక్ష తగ్గించేలా క్షమాభిక్ష కోరారని కూడా జత చేసింది. వీర్ సావర్కర్ జీవిత చరిత్రను అంతకుముందు బీజేపీ ప్రభుత్వం పాఠ్యాంశంగా చేర్చిన విషయం విదితమే. ప్రస్తుతం పాఠ్యాంశాలను మార్చే అంశం కాంగ్రెస్ – బీజేపీ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. అయితే ఆరోపణలు చేసుకుంటున్న ఈ నేతలంతా ఎవరి వాదన వారు వినిపిస్తున్నారే తప్ప చరిత్ర వాస్తవాలకు సంబంధించి చర్చకు మాత్రం సిద్ధం కావడం లేదు. కాగా, మార్పులు చేర్పులు చేసిన ఈ పాఠ్యాంశం రాబోయే విద్యాసంవత్సరం నుంచి అమలులోకి వస్తుందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ వెల్లడించారు. ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్ ఆర్.ఎస్.ఖంగరోత్ మాట్లాడుతూ విద్యా విషయాల్లో రాజకీయ జోక్యం ఉండరాదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల భావజాలాల మేరకు చరిత్ర పాఠ్యాంశాలను మారుస్తూ పోతే విద్యార్థులు గందరగోళానికి గురవుతారని, ఏది వాస్తవమో తెలుసుకోలేరని ఆయన అభిప్రాయపడ్డారు. ‘చరిత్ర వాస్తవాలకు ప్రతీక కావాలి. అది వర్తమానానికి అనుగుణంగా మారిపోకూడదు. ఎవరు గొప్ప, ఎవరు చెడ్డ అనేది రాజకీయ నాయకుల చేతుల్లో ఉండకూడదు. రాజకీయ పార్టీలు తమ భావజాలాలకు అనుగుణంగా చరిత్ర ‘గతి’ని మార్చేస్తున్నారు’ అని ప్రొఫెసర్ ఖంగరోత్ వ్యాఖ్యానించారు. ‘జర్మనీ నియంత అడోల్ఫ్ హిట్లర్‌ను ప్రపంచమంతా అసహ్యించుకుంటారు, అందులో జర్మన్లు కూడా ఉన్నారు. వాళ్లు హిట్లర్‌కు సంబంధించిన వాస్తవాలను రహస్యంగా ఉంచలేదు. బెర్లిన్ మ్యూజియంలో ఒక విభాగాన్ని హిట్లర్ పేరు కూడా పెట్టారు. హిట్లర్ మంచి చేశాడా, చెడు చేశాడా అనేదాన్ని నిర్ధారించుకునే విషయాన్ని తర్వాతి తరాలకు వదిలిపెట్టారు’ అని ఖంగరోత్ అన్నారు.
ఏ దేశ చరిత్ర అయినా తరచూ మార్పుకు గురికావడం మంచిది కాదు. దీనివల్ల విద్యార్థులే కాదు, భవిష్యత్ తరాలు కూడా అయోమయానికి గురవుతాయని ఖంగోరోత్ వ్యాఖ్యానించారు.





