
16/5/2019 గురువారం విజయవాడ పుర వీధులలో రాష్ట్ర సేవికా సమితి సేవికలు కదం తొక్కారు. వారు నిర్వహించిన కవాతు విజయవాడ ప్రజలను అలరించింది.

విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో రాష్ట్ర సేవికా సమితి (RSS మహిళా విభాగం) 15 రోజుల శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నది. ప్రవేశ్ లో 36 మంది, ప్రబోధ్ లో 19 మంది సేవికలు రెండు శ్రేణులుగా శిక్షణ పొందుతున్నారు. ప్రవేశ్ శ్గిక్షణ పూర్తయిన వారు మాత్రమే ప్రబోధ్ శిక్షణకు అర్హులు. వీరిలో విద్యార్ధినులు, ఉద్యోగినుల తోపాటు సాధారణ గృహిణులు కూడా వుండటం గమనార్హం. మా VSK ప్రతినిధి వారితో మాట్లాడినపుడు విద్యార్ధినులుగా, ఉద్యోగినులుగా, గృహిణులుగా తమ బాధ్యతలను నిర్వహించడంతోపాటు దేశ, ధర్మ రక్షణలో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాటానికే, అందులో అవగాహన, నైపుణ్యం పెంపొందించుకోవటానికే తాము ఈ శిక్షణ పొందుతున్నామని వారు తెలిపారు. వీరందరూ ఈ శిక్షణ పొందటానికి శిబిర రుసుమును, తమ సమ దుస్తులకు, ప్రయాణానికి అయ్యే ఖర్చును స్వయంగా తామే సమకూర్చుకుని రావటం విశేషం.

కాగా ఈ 15 రోజుల శిక్షణ రేపటితో ముగియనున్నది. నేడు జరిగిన మొత్తం 55 మంది సేవికలు పాల్గొన్నారు. సైనిక కవాతును మరపించే విధంగా బ్యాండు వాయిద్యాలతో, కాషాయ ధ్వజ రెపరెపలతో అత్యంత క్రమశిక్షణాయుతంగా జరిగిన ఈ కవాతును విజయవాడ పుర ప్రజలు దారి పొడవునా పూల జల్లులతో స్వాగతించారు.






