
ప్రకృతి సంరక్షణ భారతీయ సంస్కృతిలో భాగమని ప్రధాని మోదీ చెప్పారు. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ మధ్య ఘర్షణను భారత్ విశ్వసించదన్నారు. అయితే, ఆ రెండింటితోనూ సహజీవనానికి ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ అనేది విశ్వవ్యాప్త అంశమన్నారు. పెద్ద పులుల సంరక్షణకు చేపట్టిన ‘ప్రాజెక్ట్ టైగర్’ కార్యక్రమ స్వర్ణోత్సవాల సందర్భంగా ఆదివారం కర్ణాటకలోని మైసూరులో ఉన్న బండీపుర పులుల సంరక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. మిలిటరీ దుస్తులు, ఖాకీ జాకెట్, నీలి కళ్లద్దాలు, టోపీ ధరించి మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఓపెన్ సఫారీలో సుమారు 20 కిలోమీటర్లు పర్యటించారు. వెంట తెచ్చుకున్న భారీ కెమెరాలో ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆయన బంధించారు. ఆ ఫొటోలను ట్విటర్‌లోనూ మోదీ పోస్ట్ చేశారు. పెద్దపులి, సింహం, చిరుత, మంచు చిరుత, చీతా, ప్యూమ, జాగ్వార్ తదితర ఏడు రకాల క్రూర మృగాల సంరక్షణ కోసం ఐబీసీఏ(ఇంటర్నేషనల్ బిగ్ కేట్ అలయెన్స్) కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రారంభించారు. రానున్న 25 ఏళ్లలో పెద్దపులుల సంరక్షణకు చేపట్టనున్న కార్యాచరణపై ‘అమృత్‌కాల్ కా టైగర్ విజన్’ పేరిట రాసిన బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. పులుల సంతతికి సంబంధించిన నివేదికను, .ప్రత్యేక నాణేన్ని కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పెద్దపులుల సంఖ్య పెరుగుతుండటం మన దేశంతోపాటు ప్రపంచం కూడా గర్వించాల్సిన అంశమన్నారు. భారతదేశం పెద్దపులులను సంరక్షించడంతోపాటు వాటి వృద్ధికి తగిన పర్యావరణాన్ని సృష్టించిందని తెలిపారు. దేశంలో పెద్ద పులుల సంఖ్య 2006లో 1,411 ఉండగా, ఇప్పుడు 3,167కు చేరిందని మోదీ తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ప్రపంచ పులుల సంఖ్యలో 75 శాతం భారత్‌లోనే ఉండటం గర్వకారణమన్నారు. అలాగే పులుల సంరక్షణకు దేశంలో 75 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కేటాయించామని తెలిపారు.
గత 10-12 ఏళ్లలో పెద్దపులుల సంఖ్య 75 శాతం పెరిగిందన్నారు. వన్యప్రాణులను కాపాడటం ఏ ఒక్క దేశం బాధ్యతో కాదని, అది మొత్తం ప్రపంచం బాధ్యతని తేల్చిచెప్పారు. దశాబ్దాల క్రితమే దేశంలో చిరుతలు అంతరించిపోగా, ఇటీవల దక్షిణాఫ్రికాలోని నమీబియా నుంచి వాటిని తీసుకొచ్చిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. అలాగే, దేశంలో సుమారు 30 వేల ఏనుగులు, 3 వేల ఖడ్గమృగాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద ఏసియాటెక్ ఏనుగుల శ్రేణి కలిగిన దేశం కూడా మనదేనన్నారు. దేశంలో జాతీయ పార్కులు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాల సంఖ్య దశాబ్దకాలంలోనే 9 నుంచి 468కి పెరిగిందని చెప్పారు.
PTI04_09_2023_000032A.jpg
దేశంలో గణనీయంగా పెరుగుతున్న పులులు
దేశంలోని శివాలిక్ పర్వతాలు, గంగామైదాన ప్రాంతాలు, మధ్య భారతం, సుందర్‌బన్స్ ప్రాంతాల్లో పెద్దపులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, చెట్ల నరికివేత, వేటగాళ్ల దాడి తదితర కారణాలతో పశ్చిమ కనుమలు, ఈశాన్యంలోని బ్రహ్మపుత్ర మైదానాల్లో పులుల సంఖ్య తగ్గిపోయిందని వెల్లడించింది. ప్రాజెక్ట్ టైగర్ స్వర్ణోత్సవాల సందర్భంగా ఆదివారం ఈ నివేదికను కేంద్రం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2018లో మనదేశంలో 2,967 పులులు ఉండగా, 2022 నాటికి వాటి సంఖ్య 3,167కు పెరిగింది. శివాలిక్ పర్వతాలు, గంగామైదాన ప్రాంతాల్లో 2018లో 646 పులులు మాత్రమే ఉండగా, 2022లో ఆ సంఖ్య 804కు పెరిగింది. పశ్చిమ కనుమల్లో 2018లో 981 పులులు ఉండగా, వాటి సంఖ్య 2022లో 824కు పడిపోయింది. ఈశాన్య పర్వతాలు, బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతాల్లో 2018లో 219 పులులు ఉండగా, వాటి సంఖ్య తాజాగా 194కు తగ్గిపోయింది. పులులు దీర్ఘకాలం మనుగడ సాగించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆ నివేదికలో ప్రభుత్వం తెలిపింది. ప్రత్యేకించి సుహెల్వా ప్రాంతంలో పులులకు భద్రత పెంచాలని సూచించింది.





