News

తైవాన్‌పై యుద్ధమేఘాలు

177views

ద్వీప దేశం తైవాన్‌పై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? వందల ఏళ్లుగా చైనా-తైవాన్‌ల వైరం కొనసాగుతున్నా.. ముందెన్నడూ లేనట్లుగా చైనా ఇప్పుడు లైవ్‌ఫైర్‌ ట్రైనింగ్‌కు సిద్ధమవ్వడానికి కారణం యుద్ధకాంక్షేనా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఇప్పటికే చైనా తమ విన్యాసాలను యుద్ధానికి రిహార్సల్స్‌గా అభివర్ణించింది. శాశ్వత స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేందుకు తైవాన్‌ చేస్తున్న ప్రయత్నాలను ఖండించింది. సరిగ్గా.. తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయ్‌ ఇంగ్‌వెన్‌ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో.. దుందుడుకు చర్యలకు దిగింది. తైవాన్‌ అధ్యక్షురాలు గురువారం అమెరికాకు వెళ్లారు. చైనా దీన్ని నిరసిస్తూ.. శుక్రవారం నుంచి ఆ దేశం చుట్టూ 8 యుద్ధ నౌకలు, 42 ఫైటర్‌జెట్‌లను మోహరించింది. గడిచిన కొన్నేళ్లుగా చైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నా.. ఈ సారి తైవాన్‌ సమీపంలోని లుయాన్‌ సముద్రతీరంలో ‘లైవ్‌ఫైర్‌ ట్రైనింగ్‌’ నిర్వహిస్తామని ప్రకటించింది. సోమవారం తైవాన్‌కు 80 కిలోమీటర్ల దూరంలో లైవ్‌ఫైర్‌ శిక్షణ విన్యాసాలకు చైనా సిద్ధమైంది. జాయింట్‌ సోర్డ్‌, లైవ్‌పైర్‌ ట్రైనింగ్‌ నిర్వహించడం ముందెన్నడూ జరగలేదని, ఈ సారి చైనా తీసుకున్న నిర్ణయం ఆందోళనకరమని విశ్లేషకులు చెబుతున్నారు.

 

అమెరికాకు కీలక వాణిజ్య భాగస్వామి

ఈ శతాబ్దిలో తైవాన్‌ పలు రంగాల్లో అగ్రస్థానాన్ని అందుకుని, ఆయా రంగాల్లో చైనా ఆధిపత్యానికి సవాల్‌ విసురుతోంది. 600 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న తైవాన్‌ సెమీకండక్టర్ల ఉత్పత్తి, హైటెక్‌ పరిశ్రమల్లో అగ్రగామిగా ఉంది. పైగా.. అమెరికాకు 10వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. అమెరికా కూడా ఆర్థిక శక్తి, వ్యూహాత్మక ప్రదేశం, సైద్ధాంతిక కారణాలు అనే మూడు అంశాలపై బేరీజు వేసుకుని, చిన్న దేశాలకు భద్రతపై హామీ ఇస్తుంది. అన్నింటికీ మించి.. ఒకవేళ తైవాన్‌ గనక చైనా పరమైతే.. తూర్పున 150 నాటికన్‌ మైళ్ల వరకు ప్రాదేశిక జలాలపై చైనాకు పట్టు పెరుగుతుంది. జపాన్‌తోపాటు.. అమెరికాలోని గువామ్‌ ద్వీపంపై దాడి చేయడం చైనాకు సులభమవుతుంది. ఈ కారణాల వల్ల తైవాన్‌కు అమెరికా మద్దతిస్తోంది. అయితే.. ఉక్రెయిన్‌పై రష్యా దాడి జరిపినప్పుడు అమెరికా ప్రేక్షక పాత్రనే పోషించిందని, ఆయుధాలను సరఫరా చేయడం మినహా ఉక్రెయిన్‌కు పెద్దగా మద్దతివ్వలేదనే విషయాన్ని అంతర్జాతీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.

 

చైనాకు తైవాన్‌ ఎందుకు కీలకమంటే..?

చైనా ముందు నుంచి తైవాన్‌ను తమ దేశం నుంచి విడిపోయిన ప్రావిన్స్‌గానే పరిగణిస్తోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సైతం పలు సందర్భాల్లో చైనాలో తైవాన్‌ విలీనం జరిగి తీరుతుందని ఉద్ఘాటించారు. పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా 100వ వార్షికోత్సవం జరగనున్న 2049 నాటికి ప్రపంచంలోనే చైనాను అతిపెద్ద శక్తిగా నిలిపేందుకు జిన్‌పింగ్‌ ప్రణాళికలు రూపొందించారు. టిబెట్‌, హాంకాంగ్‌ను విలీనం చేసుకున్న చైనాకు.. తైవాన్‌ ఇప్పటికీ కొరకురాని కొయ్యగా మిగిలిపోయింది. ఆ ఒక్కటీ కలిస్తే.. గ్రేటర్‌ చైనాగా దేశాన్ని విస్తరించవచ్చనేది జిన్‌పింగ్‌ వ్యూహంగా తెలుస్తోంది. ఒకవేళ తైవాన్‌పై పట్టు సాధించకుంటే.. టిబెట్‌, షిన్జియాంగ్‌ ప్రాంతాల్లో వేర్పాటు ఉద్యమాలు పెరిగే ప్రమాదముందని చైనా ఆందోళన చెందుతోంది.