News

భారత్‌తో ఆస్ట్రేలియా సంయుక్త నావికా విన్యాసాలు 

306views

భారత్‌తో సంయుక్త నావికా విన్యాసాలకు ఆస్ట్రేలియా త్వరలో ఆతిథ్యమివ్వనుందని ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ ప్రకటించారు. ‘ఎక్సర్‌సైజ్‌ మలబార్‌’ పేరిట జరిపే ఈ విన్యాసాల్లో వీటిలో అమెరికా, జపాన్‌ కూడా పాల్గొంటాయన్నారు. ఆయన పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన విమాన వాహక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను గురువారం ముంబైలో సందర్శించారు. నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ హరికుమార్‌ ఆయనకు స్వాగతం పలికారు.

నౌకలో కలియదిరిగి విశేషాలు తిలకించిన అనంతరం ఆల్బనీస్‌ పలు అంశాలపై మాట్లాడారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య రక్షణ రంగంలో సాన్నిహిత్యం నానాటికీ పెరుగుతోందని, బంధం మరింత బలపడుతోందని అభిప్రాయపడ్డారు. ‘గతేడాది రికార్డు స్థాయిలో సంయుక్త విన్యాసాలు, చర్చలు జరిగాయి. త్వరలో ఆస్ట్రేలియాలో ఎక్సర్‌సైజ్‌ మలబార్‌ నిర్వహించనున్నాం. వాటిలో భారత్‌ తొలిసారిగా పాల్గొంటోంది’ అని అన్నారు.

మోదీపై ప్రశంసల జల్లు
ఏ అంశాన్నైనా భవిష్యత్తును అంచనా వేసి మరీ ఆలోచించడం ప్రధాని నరేంద్ర మోదీలో ఉన్న గొప్పదనమని ఆల్బనీస్‌ ప్రశంసించారు. ‘‘రక్షణ సంబంధాలను సుదృఢం చేసేది ఇలాంటి దూరదృష్టే. బంధాలను ఇప్పుడెలా ఉన్నాయని కాకుండా మున్ముందు ఎదుగుదలకు ఉన్న అవకాశాల పరంగా మదింపు వేయగలగాలి. ఆ సామర్థ్యమున్న నేత మోదీ’’ అని అభిప్రాయపడ్డారు. వర్తక, ఆర్థిక కార్యకలాపాల కోసం ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత సముద్ర మార్గాలు ఇరు దేశాలకూ ఆవశ్యకమేనన్నారు. మోదీ ప్రతిపాదించిన జనరల్‌ రావత్‌ డిఫెన్స్‌ ఆఫీసర్స్‌ ఎక్స్‌చేంజ్‌ ప్రోగ్రాం ఇరు దేశాల సైనిక సిబ్బంది మధ్య అవగాహన, సాన్నిహిత్యం పెంపొందేందుకు దోహదపడుతుందని ఆశాభావం వెలిబుచ్చారు.