
ఉరవకొండ పట్టణంలోని గవిమఠ స్థిత చంద్రమౌళీశ్వర స్వామి రథోత్సవం బుధవారం నేత్రపర్వంగా సాగింది. స్వామివారిని ఉదయం ప్రత్యేకంగా అభిషేకించి, పూజించారు. ఉత్సవ మూర్తిని పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్రస్వామి అధ్వర్యంలో మేళతాళాల మధ్య సాయంత్రం రథంపై కొలుపుదీచ్చారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూలహారాలను తెచ్చి రథాన్ని అలంకరించారు. అశేష జనసంద్రం నడుమ గవిమఠం నుంచి ఎదురు బసవన్న గుడి వరకూ రథాన్ని లాగారు. తిరిగి రథాన్ని యథాస్థితికి చేర్చారు. రథోత్సవంలో శివ నామస్మరణ మార్మోగింది. భక్తులు రథంపైకి పండ్లు విసిరి మొక్కు తీర్చుకున్నారు. సీఐ శేఖర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. పీఠాధిపతి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకలలో దేవదాయ శాఖ ఏసీ రామాంజినేయులు, ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్రస్వామి, ఆదోని చౌకిమఠం పీఠాధిపతి కల్యాణ్ స్వామి, గవిమఠం సహాయ కమిషనర్ చిట్టెమ్మ, ఆర్టీసీ రీజినల్ చైర్మెన మంజుల, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి సతీమణి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.




