
విశాఖ జిల్లాలో అత్యంత ప్రాచీనమైన ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయం.. శ్రీవారి కల్యాణోత్సవానికి ముస్తాబైంది. గురువారం ఉదయం 9.45 గంటలకు మాఢవీధుల్లో స్వామివారి ఉత్సవ కావడిని ఊరేగించి ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. తిరువీధి సేవలు, స్వామి కల్యాణోత్సవాన్ని పాంచరాత్ర ఆగమం ప్రకారం నిర్వహిస్తారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున ఈ క్షేత్రంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఉపమాక గరుడాద్రి పర్వతంపై స్వామివారు కల్కి అవతారంలో ఏకశిలపై స్వయం వ్యక్తమయ్యారని స్థలపురాణం ద్వారా తెలుస్తున్నది. కొండ దిగువ ఆలయంలో ఉభయదేవేరులతో కూడిన ఉత్సవమూర్తులు, క్షేత్రపాలకుడైన వేణుగోపాలస్వామి, ఆండాళ్లమ్మవారు కొలువుదీరారు. గురువారం నుంచి 10వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ప్రధాన రాజగోపురానికి ఎదురుగా వున్న చోరమండపం నుంచి ఆలయం వరకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 3వ తేదీ రాత్రి స్వామివారి కల్యాణోత్సవం కన్నులపండువగా జరుగుతుంది.




