
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఆరురోజులుగా జరుగుతున్న రాజరాజేశ్వరీ సమేత ఉమాకుక్కుటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు మంగళవారం రాత్రితో ముగిశాయి. స్వామికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. రాత్రి స్వామి, అమ్మవార్ల శ్రీపుష్పోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై ఉంచి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీఅమ్మవార్లను విశేషంగా అలంకరించారు. స్వామి, అమ్మవార్ల ప్రత్యేక అలంకారాలను దేవస్థానం అర్చకులు కోట వీర వెంకట సత్యనారాయణ, దత్తాత్రేయశర్మ, కైతేపల్లి రాజకుమార్‌శర్మ, కోట కుక్కుటేశ్వరశర్మలు చేశారు. పుష్పోత్సవంలో పాల్గొన్న భక్తులకు దంపత తాంబూలాలు అందజేశారు. అనంతరం ఏకాంతసేవాగానం జరిగింది. కార్యక్రమాల్లో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ధర్మకర్తలమండలి చైర్మన్ ఆగంటి ప్రభాకరరావు, ఈవోలు సౌజన్య, వడ్డి శ్రీనివాసరావులు, ధర్మకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా రాత్రి జరగాల్సిన తెప్పోత్సవాన్ని రద్దు చేశారు.
సామర్లకోట, ఫిబ్రవరి 21: పట్టణంలోని కుమారరామ భీమేశ్వరస్వామి, బాలా త్రిపుర సుందరి అమ్మవార్లకు శ్రీపుష్పయాగోత్సవ పూజలు మంగళవారంరాత్రి వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో డి.నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో కల్యాణ వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఆలయ పండితులు కొంతేటి జోగారావు, శర్మ, రాంబాబు, వేమూరి సోమేశ్వరశర్మ, వెంకన్న శాస్త్రోక్తంగా పుష్పార్చన నిర్వహించారు. ఉత్సవమూర్తులను ప్రదర్శనగా బాలాత్రిపురసుందరి అమ్మవారి మందిరం వద్దకు తోడ్కొని వచ్చారు. వివిధ పుష్పాలతో అలంకరించిన ఊయల మందిరంలో అలంకరింపజేసి దర్శనాలకు అనుమతించారు. పలువురు దాతలు సమకూర్చిన 110 రకాల పిండి వంటకాలను ఊయల మండపం వద్ద అలంకరించారు. భక్తులకు తువాళ్ళు, రవికలు, పసుపు, కుంకుమ, చక్కెర పొంగలి, కొబ్బరి హల్వా, లడ్డూ, అన్నవర సత్యదేవుని ప్రసాద ప్యాకెట్లను పంపిణీ చేసారు.





