
భార్యాభర్తల మధ్య విడాకుల కేసులో పితృత్వాన్ని నిర్ధారించేందుకు పిల్లలకు డీఎన్‌ఏ పరీక్ష చేయాలంటూ ఆదేశించరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అనివార్య పరిస్థితులు, కొన్ని అరుదైన కేసుల్లో మాత్రమే డీఎన్‌ఏ పరీక్ష చేయాలని స్పష్టం చేసింది. అల్పమైన ఆరోపణల నేపథ్యంలో చిన్నారులకు డీఎన్‌ఏ టెస్టు నిర్వహించడమంటే వారి గోప్యతకు భంగం కలిగించడమేనని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం సోమవారం తేల్చిచెప్పింది. ‘‘పిల్లలకూ గోప్యత హక్కు ఉంటుంది. భార్యాభర్తల విడాకుల కేసులో వారు కక్షిదారులు కాదు. ఫోరెన్సిక్/డీఎన్‌ఏ టెస్టులకు ఆదేశించడానికి వారేమీ వస్తువులు కాదన్న విషయాన్ని కోర్టులు గుర్తుంచుకోవాలి. భార్యాభర్తల మధ్య యుద్ధంలో చిన్నారులు బలికాకూడదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో తల్లిదండ్రుల ప్రయోజనాల కోసం పిల్లలకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలా? వద్దా? అనేది నిర్ణయించే ముందు పరిశీలించాల్సిన అంశాలను వివరించింది. భారతీయ ఆధారాల చట్టం 1872లోని సెక్షన్ 112 కింద వివాహ బంధంలో భాగంగా చిన్నారి పుట్టుకపైనే అనుమానం వ్యక్తం చేసిన సందర్భాల్లో అనుసరించాల్సిన సూత్రాలు, మార్గదర్శకాలను వెల్లడించింది.
ఫ్యామిలీ కోర్టు, బాంబే హైకోర్టు ఆదేశాల కొట్టివేత..
విడాకుల కేసులో భాగంగా తన భర్త చిన్నారికి డీఎన్‌ఏ టెస్టు చేయించాలంటూ వేసిన పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు, బాంబే హైకోర్టు సమర్థించడాన్ని సవాలు చేస్తూ భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో భార్య తరఫున సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ, భర్త తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. పిల్లల పుట్టుకకు చట్టబద్ధతపై ఆధారాల చట్టంలోని సెక్షన్ 112ను పరిశీలించకుండానే కోర్టులు డీఎన్‌ఏ టెస్టులకు ఆదేశాలు ఇస్తున్నాయని భార్య తరఫు న్యాయవాది సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పిల్లల ప్రాథమిక హక్కులు, గోప్యత, గుర్తింపు హక్కులు, ప్రయోజనాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని చెప్పారు. భర్త తరఫున న్యాయవాది దీన్ని ఖండించారు. పిటిషనర్ తన అక్రమ సంబంధాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. అందుకే అప్పీలు దాఖలు చేశారని అన్నారు. అక్రమ సంబంధాలను నిరూపించాలంటే డీఎన్‌ఏ పరీక్షే మార్గమని, దీన్ని గోప్యత హక్కు కింద అడ్డుకోవడానికి వీల్లేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఫ్యామిలీ కోర్టు, బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. అయితే విడాకుల కేసులో భర్త చేసిన ఆరోపణలను నిరూపించేందుకు ఇతర ఆధారాలు ఉంటే సమర్పించడానికి ఇబ్బందేమీ లేదని తెలిపింది.
సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఇలా..
ఆధారాల చట్టం 1872లోని సెక్షన్ 4 కింద.. భార్యాభర్తలు కలిసి ఉన్న సమయంలో జన్మించిన పిల్లలకు పితృత్వంపై అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు దర్యాప్తు కోరరాదు. ఇలాంటి ఆరోపణలు చేయాలంటే బలమైన ఆధారాలు ఉండాలి. లేదంటే సెక్షన్ 112 కింద విచారణను కోర్టులు అడ్డుకోవచ్చు.
ఆధారాల చట్టంలోని సెక్షన్ 112 కింద కక్షిదారు.. పిల్లల పుట్టుకపై అనుమానం వ్యక్తం చేసినప్పుడు తనకు భార్యతో శారీరక సంబంధం లేదన్న విషయాన్ని నిరూపించాలి. అలా చేయనప్పుడు డీఎన్‌ఏ టెస్టుకు ఆదేశించకూడదు.
ఒకవేళ డీఎన్‌ఏ టెస్టుకు ఆదేశించాల్సి వస్తే కోర్టులు పిల్లల హక్కులు, వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి.
కోర్టులు ఇలాంటి ఆదేశాలను అత్యంత అరుదైన కేసులు, అనివార్యమైన సందర్భాల్లోనే జారీ చేయాలి.
చిన్నారి ప్రయోజనాలను తల్లే ఎక్కువగా పరిరక్షిస్తుంది. బిడ్డ మనోభావాలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో డీఎన్‌ఏ టెస్టుకు తల్లి అంగీకరించకపోతే.. ఆధారాల చట్టంలోని సెక్షన్ 114(హెచ్) ప్రకారం జోక్యం చేసుకోకూడదు.



