

మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శ్రీశైలంలోని శ్రీగిరి భక్తులతో నిండిపోయింది. బ్రహ్మోత్సవ వేడుకలు తిలకించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చారు. పెద్దఎత్తున పాతాళగంగలో పుణ్య స్నానమాచరించిన భక్తులు క్యూలైన్లు చేరుకున్నారు. క్యూలైన్లు ముందుకు నెమ్మదిగా సాగడంతోపాటు దర్శనానికి భక్తుల వరుస పెరిగిపోయింది. మరోవైపు పాదయాత్ర క్యూలైన్లు కిటకిటలాడాయి. వీటికి తోడు రూ.500, రూ.200 క్యూలైన్లలో సైతం భక్తుల రద్దీ పెరిగిపోయింది. మధ్యాహ్న సమయంలో పాదయాత్ర క్యూలైన్‌లో లక్ష్మీదేవి అనే వృద్ధురాలు, శ్యామల అనే బాలిక సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పాదయాత్ర, ఉచిత క్యూలైన్లు భక్తులతో నిండిపోవడంతో వృద్ధులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కనీసం వారికి తాగునీరు కూడా అందలేదు. సిబ్బంది వాటర్ ప్యాకెట్లు గాల్లో విసిరేసి చేతులు దులుపుకున్నారు. వాటర్ ప్యాకెట్లు అవసరమైన వారికి అందలేదనే విమర్శలు తలెత్తాయి. కనీసం క్యూలైన్ల వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయలేదు. పాదయాత్ర క్యూలైన్‌లో దర్శనానికి నిల్చున్న పలువురు భక్తులు దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు.
దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు లడ్డూల కోసం భగీరథ ప్రయత్నమే చేశారు. కౌంటర్లన్నీ నిండిపోయి దివ్యాంగుల దర్శన క్యూలైన్ వరకు భక్తులు బారులు తీరారు. లడ్డూలు పొందడానికి కనీసం రెండు గంటలకు పైగా సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
జగత్ కల్యాణం..
ఆది మధ్యాంత లయుడైన పరమ శివుడు లింగాకారంలో ఉద్భవించడమే మహా శివరాత్రి. ఈ సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం కైలాసంగా విరాజిల్లుతుంది. శనివారం లక్షలాది భక్తుల ఓంకార నాదాల మధ్య స్వామివారికి పాగాలంకరణ, ఆది దంపతుల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ప్రభోత్సవం, నంది వాహన సేవ నయనానందభరితంగా సాగింది.
లింగోద్భవకాల మహా రుద్రాభిషేకం..
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి 10 గంటల నుంచి స్వామివారికి లింగోద్భవకాల మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపించారు. ఆలయ ప్రాంగణంలోని మల్లికాగుండంలోని జలాలు, పంచామృతాలు, పలు ఫలోదకాలతో అభిషేకం చేశారు.
పాగాలంకరణ..
మహారుద్రాభిషేకం మొదలు కాగానే పాగాలంకరణ ప్రారంభించారు. దేశంలోని శైవ క్షేత్రాల్లో శ్రీశైలంలో మాత్రమే పాగాలంకరణ ప్రత్యేకం. బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం సంవత్సరంపాటు నేసిన 365 మూరల పాగను గర్భాలయ విమాన శిఖరం నుంచి ముఖ మండపంపైన ఉన్న నందులకు అనుసంధానం చేస్తూ అలంకరించారు. ఈ కార్యక్రమానికి 23 పాగాలను ఉపయోగించారు. రాత్రి 10 గంటలకు రుద్రాభిషేకం మొదలవగానే ప్రధాన ఆలయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆ వెంటనే పృథ్వీ వెంకటేశ్వర్లు దిగంబరుడై పాగాలంకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాగాలంకరణ జరుగుతున్నంతసేపు భక్తులు ’ఓం నమ: శివాయ’ పంచాక్షరీ మంత్రం జరిపించడంతో శ్రీగిరి క్షేత్రం పులకించిపోయింది.
కల్యాణోత్సవం..
శనివారం రాత్రి 12 గంటల సమయంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది. కంకణాలు, స్వామి, అమ్మవార్ల ఆభరణాలు, యజ్ఞోపవీతం, భాషికాలను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. స్వామివారు పట్టువస్త్రాలను ధరించి, తలపై ఒక వైపు గంగమ్మను, మరోవైపు నెలవంకను, మెడలో రుద్రాక్ష మాలను, నుదుట విభూది రేఖలతో పెళ్లి కుమారుడిగా ముస్తాబయ్యారు. భ్రమరాంబదేవి పట్టువస్త్రాలను ధరించి, నుదుట కల్యాణ తిలకాన్ని, బుగ్గన చుక్కను, సూర్యాభరణాలను ధరించి పెళ్లి కూతురుగా దర్శనమిచ్చింది. స్వామి అమ్మవార్ల ఇరువురు అర్ధరాత్రి 12 గంటలకు వెండి పల్లకిలో పెళ్లి మండపానికి చేరుకున్నారు. నుదుట భాషికం కట్టి, తిలకం దిద్ది, కస్తూరి జవ్వాజీ సుగంధ పరిమళాలతో పెళ్లి పీటలపై ఆశీనులయ్యారు. స్వామి, అమ్మవార్ల కల్యాణ సంబంరం అంబరాన్ని తాకింది. ఆదిదేవుడి కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం, కాణిపాకం దేవస్థానం పట్టువస్త్రాలు సమర్పించాయి.
కన్నులారా ప్రభోత్సవం..
సాయంత్రం క్షేత్ర ప్రధాన వీధుల్లో అశేషభక్తజనం నడుమ ప్రభోత్సవం నిర్వహించారు. శివరాత్రి తర్వాతి రోజు జరిగే రథోత్సవ నిర్వహణకు వీలుగా ముందస్తుగా ప్రభోత్సవం జరుపుతారు. శనివారం సాయంత్రం జరిగిన ప్రభోత్సవంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఆలయ వీధుల్లో ప్రభ్సోతం ఘనంగా జరిగింది.
నంది వాహనంపై ఊరేగిన మల్లన్న..
భ్రమరాంబ సమేతుడై మల్లికార్జునుడు నంది వాహనంపై ఊరేగారు. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు స్వామివారికి నందివాహన సేవ నిర్వహించడం అనవాయితీ. ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఈ సేవ నిర్వహించారు. అనంతరం ఆలయంలో నందివాహనంపై కొలువైన ఆది దంపతులను ఊరేగించారు. వివిధ జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలు భక్తులను ఆలరించాయి.





