
కర్నూలు నగర శివారులోని జగన్నాథగట్టుపై వెలసిన ఉమా సమేత రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు నరసింహారెడ్డి, ఈ. మల్లికార్జునరెడ్డి, కె. క్రిష్టన్న, ఆలయ ఈవో వై. గుర్రెడ్డి తెలిపారు. స్థానిక శాలమ్మ సత్రం సమావేశహాలులో కమిటీ ప్రతినిధులు శివరాత్రి ఉత్సవాల వివరాలు తెలిపే కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… 18న శివరాత్రి పర్వదిన సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకు భక్తుల రాకపోకలకు ఆర్టీసీ సంస్థ బస్సులను నడుపుతోందని తెలిపారు. ఆలయంలో 17న ఉదయం 8 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశస్థాపన, రుద్రహోమం, ధ్వజారోహణ ఉంటుందని అన్నారు. 18న ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు, ఉదయం 9 గం టల నుంచీ పాలాభిషేకం, మధ్యాహ్నం ఒంటి గంటకు స్వామివారికి అలంకరణ, రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేకాలు ఉంటాయని తెలిపారు. 19న వేకువజామున 3 గంటలకు శివపార్వతుల కల్యాణో త్సవం, స్వామివారి ప్రాకార పల్లకి సేవ, ఉదయం 10 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయని వారు వివరించారు. దిన్నెదేవరపాడుకు చెందిన దివంగత పెరుగు సీతారామిరెడ్డి కుమారులు నిరంతర ప్రసాద వితరణ చేస్తారని తెలిపారు.





