News

శ్రీకాళహస్తిలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం

382views

నిష్కల్మష భక్తితో శివైక్యం చెందిన కన్నప్ప ధ్వజారోహణంతో ముక్కంటీశుడి శివరాత్రి ఉత్సవాలు శ్రీకాళహస్తిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం కన్నప్ప ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముక్కంటి ఆలయంలోని అలంకార మండపంలో భక్తకన్నప్ప ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించారు. వేదపండితులు కన్నప్ప ఉత్సవమూర్తికి ఆగమోక్తంగా వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మంగళవాయిద్యాలు, మేళతాళాలతో ఊరేగింపుగా కన్నప్ప కొండపైకి తీసుకెళ్లారు. కన్నప్ప ఆలయం ఎదుట ఉత్సవమూర్తిని ఉంచి ధ్వజారోహణ పూజలకు సంకల్పం పలికారు. అనంతరం కన్నప్ప ఆలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలుచేసి ధవళపతాకం, పూలమాలను ఎగురవేసి ధ్వజారోహణ క్రతువును నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో కొండపైకి తరలివచ్చారు. అనంతరం ధ్వజానికి వేదపండితులు మంత్రపుష్పం, హారతులు సమర్పించారు. ముక్కంటి ఆలయ చైర్మన్‌ అంజూరు శ్రీనివాసులు, పాలకమండలి సభ్యులు, ఈవో సాగర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.