
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో పి.ప్రభాకరరావు తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లను విలేకరులకు వివరించారు. ఈ నెల 18 నుంచి మూడు రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. భక్తులకు ఉచిత, ప్రత్యేక దర్శనాలకు వేర్వేరుగా బారికేడ్లు, వీఐపీలకు వారాహి అమ్మవారి ఆలయం నుంచి ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులకు ఎండతగలకుండా షామియానాలు వేస్తున్నామని చెప్పారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. 18న మహాశివరాత్రి జాగారం, 19న పడియా, 20న స్వామివారి చక్రతీర్థ స్నానాలు వంశధార నదిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయితే గతంలో వంశధార నదిలో స్వామివారి చక్రతీర్థ స్నానాలు ఒంటి గంటకు నిర్వహించేవారమన్నారు. ఈ ఏడాది మధ్యాహ్నం 1.30 గంటల వరకు వరకు అమావాస్య ఉన్నందున పాడ్యమి గడియలు వచ్చిన వెంటనే స్వామి ఉత్సవ మూర్తులను వంశధార నదికి తీసుకెళ్లి చక్రతీర్థ స్నానాలు 2 గంటల సమయంలో నిర్వహిస్తున్నామని, భక్తులు సహకరించాలని కోరారు.





