
అనంతపురం జిల్లా కంబదూరులోని మల్లేశ్వరస్వామి దేవాలయంలో గంగపూజతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఉన్న కోనేరుబావిలో గంగపూజను వీక్షించడానికి భక్తులు తరలివచ్చారు. గంగపూజను నిర్వహించిన అనంతరం అఖండ జ్యోతి ప్రజ్వలన వెలిగించారు. అనంతరం దేవాలయంలో ఓం నమఃశివాయ అనే మంత్రంతో భజనను ప్రారంభించారు. ఇలా వారం రోజుల పాటు ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు, నిత్య భజనలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వారం రోజుల పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆలయాన్ని విద్యుతదీపాలంకరణతో ముస్తాబు చేశారు. ఈ దేవాయంలో శివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకతగా నిలుస్తోంది. అదేవిధంగా శివపార్వతుల కల్యాణం కూడా వీక్షిస్తే సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని ఇక్కడి భక్తుల్లో అపారమైన నమ్మకం ఉంది. ఈ దేవాలయంలో నిర్వహించే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు స్థానికులే కాకుండా, చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులతో పాటు, కర్ణాటక ప్రాంతం నుంచి కూడా తరలివస్తారు.
అశ్వత్థం తిరుణాళ్ల…
తాడిపత్రి పరిధిలోని పెద్దపప్పూరు మండలంలోని చిన్నపప్పూరు గ్రామ సమీపంలో వెలసిన అశ్వత్థ నారాయణస్వామి, చక్రస్థాపిత భీమలింగేశ్వర స్వామి ఆలయ తిరుణాళ్ల ఆదివారం ఘనంగా నిర్వహించారు. మాఘమాసం సందర్భంగా జరుగుతున్న తిరుణాళ్లలో భాగంగా కట్టపై వెలసిన అశ్వత్థ నారాయణుడికి వెండికవచంతోపాటు వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. భీమలింగేశ్వరునికి వెండితొడుగులతో అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి వార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
కోటంకలో..
గార్లదిన్నెలోని గుంటిసుబ్రహ్మణ్యేశ్వరస్వామి తిరుణాళ్ల ఆదివారం వైభవోపేతంగా నిర్వహించారు. స్వామివారి తిరుణాళ్ల ప్రతి ఏడాది మాఘ మాసంలో నాలుగువారాల పాటు వైభవంగా సాగుతాయి. అందులో భాగంగా నాలుగో రోజు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మొక్కులు నెరవేరిన భక్తులు స్వామివారికి బియ్యం, బేడలు, కానుకలు సమర్పించుకున్నారు.





