News

చైనా నిఘా బెలూన్‌ పేల్చివేత.. అమెరికాకు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించిన డ్రాగన్‌ దేశం!

293views

అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలకు కారణమైన గాలి బుడగను అగ్రరాజ్యం కూల్చివేసింది. డ్రాగన్‌ ‘నిఘా బెలూన్‌’గా భావిస్తున్న ఈ బుడగను అమెరికా ఫైటర్‌ జెట్‌ ఎఫ్‌-22తో కూల్చివేసింది. ఈ బెలూన్‌ అట్లాంటిక్‌ సముద్రం మీదుగా వెళ్తుండగా.. ఏఐఎం 9ఎక్స్‌ సైడ్‌ విండర్‌ క్షిపణిని ఉపయోగించి అమెరికా పేల్చివేసింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం ఈ చర్య చేపట్టారు. బెలూన్‌ శకలాలు దక్షిణ కరోలినా మిర్టిల్‌ తీరంలో పడ్డాయి. అగ్రరాజ్య సైన్యం వీటిని సేకరిస్తోంది. ఈ బెలూన్‌ తొలుత అమెరికా-కెనడా సరిహద్దు రాష్ట్రమైన మోంటానాలో కనిపించిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆగ్నేయ అమెరికాలోని దక్షిణ కరోలినా వరకు వచ్చింది. అయితే.. చైనా నిఘా బెలూన్‌ గురించి గత బుధవారం సమాచారం తెలిసిన వెంటనే సాధ్యమైనంత త్వరగా కూల్చివేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు భూమ్మీద ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగకూడదన్న ఉద్దేశంలో.. బెలూన్‌ సముద్రతలంపైకి వచ్చాక చర్యలు చేపట్టారు. మరోవైపు అమెరికా తీరుపై చైనా మండిపడింది. ఆ బెలూన్‌ పౌర వినియోగానికి ఉద్దేశించినదని పేర్కొంది. ఈ చర్యపై తమ స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.