ArticlesNews

రామచరితమానస్ అత్యంత గౌరవనీయమైన గ్రంథం.. ప్రతి ఇంట్లోనూ పూజిస్తారు – యూపీ సీఎం యోగి

146views

నిర్ణీత గడువులోగా రామమందిరం పనులు పూర్తవుతాయని యూపీ సీఎం యోగి ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. ఇటీవల ‘రామచరిత మానస్‌’పై సమాజ్ వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అభివృద్ధిని కాకుండా విభజనను నమ్ముకునేవారు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారని యోగి తెలిపారు. రామచరిత మానస్‌ పై వివాదాలు ఆ రాష్ట్ర అభివృద్ధిపై ప్రజల దృష్టిని మరల్చేందుకు చేస్తున్న ప్రయత్నమేనని అన్నారు. రామచరితమానస్ అత్యంత గౌరవనీయమైన గ్రంథమని.. ప్రతి ఇంట్లోనూ పూజిస్తారు. దీని ప్రాముఖ్యత తెలియని వారు ప్రశ్నలను లేవనెత్తుతున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. “తులసీదాస్ రచించిన ఈ రామయణంలోని కొన్ని భాగాలు కులం ప్రాతిపదికన సమాజంలోని విస్తృత వర్గాలను అవమానించేలా ఉన్నాయని, వాటిని తొలగించాలని” యూపీలో ప్రముఖ ఓబీసీ నేతగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు. అయితే.. మౌర్య వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని సమాజ్ వాదీ పార్టీ ఇప్పటికే వివరణ ఇచ్చుకుంది. ఈ అంశంపైనే తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఎం యోగి.. సమాజ ఐక్యతకు” మార్గదర్శకంగా నిర్వచించిన హిందూ పవిత్ర గ్రంథాన్ని విమర్శించే వారిపై చర్యలు ప్రారంభించామని చెప్పారు. తాను యోగిని అని, యోగిగా తన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నానని, ప్రజలు తనను వారు కోరుకున్న విధంగా గ్రహించగలరని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

గుడ్‌ గవర్నెన్స్ ద్వారా అన్ని కమ్యూనిటీలను చేరుకోవచ్చు అని సీఎం యోగి అన్నారు. ఉత్తరప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్, మెరుగైన నిర్వహణ అన్ని కమ్యూనిటీలకు సాయపడిందని తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని యూపీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 6 ఏళ్లలో 5 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. వచ్చే 2-4 ఏళ్లలో లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయన్నారు.

ఇటీవల విడుదలైన షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్‌లోని ‘బేషరమ్ రంగ్’ పాట వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం మాట్లాడారు. సినిమా డైరక్టర్లు దీనిని గుర్తించి వ్యవహరించాలన్నారు. పఠాన్ మూవీ సహా పలు సినిమాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న బాయ్ కాట్ పాలిటిక్స్ పై మాట్లాడుతూ.. కళాకారులు, పండితులందరినీ గౌరవించాలని.. అయితే అదే సమయంలో ప్రజల మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలను చిత్ర నిర్మాతలు పెట్టకూడదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.