‘దైవదూషణ కంటెంట్’ పేరుతో వికీపీడియాను నిషేధించిన పాకిస్తాన్.. గతంలోనూ టిండర్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ఫ్లాట్‌ఫాంలూ బ్లాక్ చేసిన వైనం!

వికీపీడియాలో ‘దైవదూషణ సమాచారం’ ఉందంటూ ఆ వెబ్‌సైట్‌ను పాకిస్తాన్ తమ దేశంలో బ్లాక్ చేసింది. ఉచిత ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా సైట్ అయిన వికీపీడియా నుంచి ఆ సమాచారాన్ని తొలగించటానికి పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ (పీటీఏ) తొలుత 48 గంటల గడువు ఇచ్చింది. ఆ గడువు ముగిసిన తర్వాత వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తున్నట్లు శనివారం నాడు ప్రకటించింది. అయితే.. పాక్ అభ్యంతరం చెప్తున్న మెటీరియల్ వివరాలను వెల్లడించలేదు. ఈ నిషేధం వల్ల ‘‘అతిపెద్ద ఉచిత విజ్ఞాన భాండాగారం’’ పాకిస్తానీ ప్రజలకు అందుబాటులో లేకుండా నిరోధించినట్లు అవుతుందని వికీపీడియాను నిర్వహించే వికీమీడియా ఫౌండేషన్ పేర్కొంది. దైవదూషణ అనేది ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్తాన్‌లో చాలా సున్నితమైన అంశం. గతంలో టిండర్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వేదికలను కూడా పాకిస్తాన్‌లో బ్లాక్ చేసిన సందర్భాలున్నాయి. పాకిస్తాన్ తాజా చర్య పట్ల వాక్ స్వాతంత్య్ర ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘ఇంటర్నెట్‌లో కంటెంట్ మీద మరింత ఎక్కువ నియంత్రణ తెచ్చుకోవటానికి కఠోర ప్రయత్నం’’ జరుగుతున్నట్లు కనిపిస్తోందని వారు పేర్కొన్నారు. మరోవైపు ‘‘ఎలాంటి అసమ్మతినైనా అణచివేయటమే వారి ప్రధాన లక్ష్యం’’ అని డిజిటల్ రైట్స్ యాక్టివిస్ట్ ఉసామా ఖిల్జీ విమర్శించారు.





