News

ఆదివాసీల అతిపెద్ద పండుగ గాంధారి మైసమ్మ జాతర ప్రారంభం

335views

గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, డోలు చప్పుళ్ల మధ్య, కొండ కోన పులకించేలా, చెట్టు పుట్ట పరవశించేలా గాంధారి మైసమ్మ జాతర శుక్రవారం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ శివారులోని చారిత్రక గాంధారి కోట వద్ద మూడు రోజులపాటు నిర్వహించే గాంధారి మైసమ్మ జాతర జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందేనని చెబుతుంటారు. ఈ జాతరకు దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ఆదివాసీ గిరిజనులు తరలివస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గడ్, తెలంగాణ ప్రాంతాల నుంచి ఆదివాసి నాయక్ పోడులు, గిరిజనులు ఈ జాతరలో పాల్గొంటారు.

జాతరలో భాగంగా నాయక్ పోడులు గోదావరిలోని సదర్ భీమన్న మరియు ఇతర దేవతల చెక్క శిల్పాలకు పవిత్ర స్నానాలు ఆచరించి వాటిని బొక్కలగుట్ట శివార్లలోని ఆలయానికి తీసుకువచ్చారు. డప్పు చప్పుళ్ళతో, నృత్యాలతో ఆలయం వద్ద నాయక్ పోడులకు చెందిన రొడ్డవంశానికి చెందిన వారి ముఖ్యమైన మతపరమైన సాంస్కృతిక వ్యవహారాన్ని కొనసాగించారు. సదర్ల భీమన్న విగ్రహాల వద్ద పట్నాలు వేసి తప్పెటగుళ్ళతో, పిల్లనగ్రోవి ఆటపాటలతో ఆదివాసి గిరిజనులు చేసే ఈ సంబరం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. జాతరలో రెండవ రోజు అయిన శనివారం కోటపై ఉన్న మైసమ్మకు, ఇతర దేవతలకు మహా పూజ చేసి శనివారం అర్ధరాత్రి సమయంలో నాయక్ పోడు సంఘం కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, తప్పెటగళ్ళు, పిల్లన గ్రోవి ప్రదర్శనలు ఉంటాయి. చివరి రోజు అయిన ఆదివారం నిర్వహించనున్న ప్రజా దర్బార్ అందరినీ ఆకట్టుకుంటుంది.