News

ఉయ్యూరు వీరమ్మ తిరుణాళ్లలో భక్తులకు అవస్థలు.. ఇక బ్లేడ్‌ బ్యాచ్‌ ఆగడాలకు అడ్డేలేదు?

452views

కృష్ణా జిల్లా ఉయ్యూరు వీరమ్మ తిరుణాళ్లలో భక్తులు అవస్థలు పడుతున్నారు. ఏటా తిరునాళ్ల రెండో రోజు సాయంత్రానికి ఊయల ఉత్సవం ముగించుకుని అమ్మవారు ఆలయ ప్రవేశం చేయటం ఆనవాయితీ. అయితే.. ఈ ఏడాది రెండో రోజు అనగా.. బుధవారం రాత్రి 8గంటలు దాటినా ఊయల ఉత్సవం పూర్తి కాలేదు. అసలు అమ్మవారి ఊయల ఉత్సవం ఏ సమయంలో ముగుస్తుందో తెలియని పరిస్థితుల్లో తిరుగుడు గండ దీపాల భక్తుల ఆందోళన వ్యక్తం చేశారు. పలు జిల్లాల నుంచి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకునేందుకు ఉపవాస దీక్షతో వచ్చిన భక్తులకు పొద్దుపోతున్నా అమ్మవారు ఆలయ ప్రవేశం జరగకపోవడంతో ఆకలి దప్పులతో అల్లాడిపోయారు. మరోవైపు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వసతులు ఏర్పాటు చేయకపోవడంతో మహిళా భక్తుల ఇబ్బందులు పడుతున్నారు.

రెచ్చిపోతున్న బ్లేడ్‌ బ్యాచ్‌..
ఉయ్యురు వీరమ్మతల్లి తిరునాళ్ళలో కొంతమంది బ్లేడ్ బ్యాచ్ యువకులు ఉయ్యూరు వచ్చి గలాటా చేశారు. ఈ క్రమంలో అక్కడున్న స్థానికులు అడ్డుకోగా నోట్లో నుంచి బ్లేడులు తీసి ఇష్టారాజ్యంగా దాడి చేశారు. ఈ దాడిలో భక్తులకు, గుడి కమిటీ వారికి కూడా కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీస్ శాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా ఇలాంటి సంఘటన జరగడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కందిపోటీ దుర్గాప్రసాద్(30) అనే వ్యక్తి మెడ మీద తీవ్ర గాయాలు చేశారు. దీంతో అతనికి 18 కుట్లు పడినట్లు సమాచారం. రాత్రి 11.30 మధ్య జరిగిన సంఘటనతో తేరుకున్న పోలీసులు నిందితుల్లో ఇద్దరిని పట్టుకుని స్టేషన్‌కి తరలించారు. తిరునాళ్ళలో పోలీసుల భద్రత వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని భక్తులు వాపోతున్నారు.