
పాకిస్థాన్‌లో మతమార్పిడుల ఘటనలు భయాందోళనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇస్లాంలోకి మారని హిందూ యువతులు, మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా పాకిస్థాన్ దేశంలోని సింధ్ ప్రావిన్సు ఉమర్‌కోట్ జిల్లాకు చెందిన ఓ హిందూ బాలికను ఇస్లాం మతంలోకి మారాలని కొందరు ముస్లింలు బలవంతం చేశారు. దానికి బాలిక అంగీకరించకపోవడంతో అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా.. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై బాధిత బాలిక ఓ వీడియోలో తనపై జరిగిన ఉదంతాన్ని వివరించింది. ఇది ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
మూడు రోజులుగా అఘాయిత్యం..
పాక్‌లోని సింధ్ ప్రాంతంలో హిందూ యువతుల్ని ఇస్లాంలోకి మార్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.. మారనివారిపై అక్కడి ముస్లింలు అకృత్యాలకు తెగబడుతున్నారని బాధిత బాలిక వాపోయింది. తొలుత కిడ్నాపర్లు తనను ఇస్లాంలోకి మారాలని బెదిరించారని దానికి తాను నిరాకరించానని.. దీంతో తనపై అత్యాచారం చేశారని బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. మూడు రోజులపాటు బాలికను ఓ గదిలో బంధించి కిడ్నాపర్లు అత్యాచారం చేశారని తెలిపింది. చివరికి వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరానని వివరించింది. దీనిపై స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసినా నిందితులపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వీడియోలో బాలిక తెలిపింది. ఇబ్రహీం మాంగ్రియో, పున్హో మాంగ్రియో, వీరి సహచరుడు తనను అపహరించినట్లు బాలిక పేర్కొంది.
హిందువులే లక్ష్యంగా పాక్‌లో దాడులు..
పాకిస్థాన్ దేశంలో హిందువులు అధికంగా ఉండే ప్రాంతాలైన థార్, ఉమర్‌కోట, మీర్‌పుర్కాస్, గోటికి, ఖైరిపూర్ తదితర చోట్ల ముస్లింలు పలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. బలవంతపు మతమార్పిడులు చేసి హిందూ యువతులను పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వారి మాట వినకపోతే అత్యాచారానికి పాల్పడటం లేదా అంతం చేయడం వంటి ఘాతుకాలకు ఒడిగడుతున్నారు.
గత ఏడాది జూన్‌లో.. కరీనా కుమారి అనే హిందూ యువతిని ఇస్లాంలోకి మార్చి ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక అదే ఏడాది మార్చి నెలలో ముగ్గురు బాలికలకు మతం మార్చి కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలోనే వివాహం జరిపించారు. పూజ కుమారి అనే మరో యువతిని మతం మారాలని బలవంతం చేయగా.. ఆమె నిరాకరించడంతో ఆగ్రహించిన దుండగులు ఆమెను హత్య చేశారు.





