
వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ దేశ బడ్జెట్ (Budget 2023)ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సిద్ధమవుతున్న వేళ.. ఈ మంత్రిత్వ శాఖ (Finance Ministry)లో గూఢ చర్యం ఘటన కలకలం రేపుతోంది. ఆర్థికశాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తోన్న ఓ వ్యక్తి.. అత్యంత రహస్య సమాచారాన్ని విదేశాలకు అందిస్తున్నట్లు దిల్లీ పోలీసు క్రైం బ్రాంచ్ గుర్తించి అరెస్టు చేసింది.
గూఢచర్యం (espionage) ఆరోపణలతో ఆర్థికశాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న సుమిత్‌ను దిల్లీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అతను గత కొంతకాలంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన కీలక సమాచారాన్ని విదేశాలకు అందిస్తున్నాడని, అందుకు బదులుగా భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటున్నాడని పోలీసులు వెల్లడించారు. అధికారిక రహస్యాల చట్టం కింద అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. సమాచారాన్ని చెరవేసేందుకు నిందితుడు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల పలు మంత్రిత్వ శాఖల్లో తరచూ గూఢచర్యం ఘటనలు వెలుగు చూస్తుండటం.. దేశ భద్రతకు సవాలుగా మారింది. గతేదాడి నవంబర్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖలో డ్రైవర్‌గా పనిచేసే ఓ వ్యక్తి.. పాక్ మహిళ వలలో పడి దేశ సమాచారాన్ని ఆమెకు పంపాడు. దీన్ని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఇక తాజాగా మరో ఘటన వెలుగు చూడటం.. అది కూడా బడ్జెట్ ప్రకటనకు ముందు బయటకు రావడం కలకలం రేపుతోంది. బడ్జెట్‌కు సంబంధించిన పత్రాలు విదేశాలకు లీకైతే దేశీయ మార్కెట్‌పై ప్రతికూల పరిస్థితి మొదలవుతుందనే ఆందోళనలు వ్యక్త మవుతున్నాయి.





