News

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్.. చంపేస్తామంటూ ఆగంతకుడు ఫోన్‌!

270views

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతున్నాయి. నాగ్‌పూర్‌లోని గడ్కరీ కార్యాలయానికి శనివారం ఫోన్ కాల్ చేసి గడ్కరీని హత్య చేస్తామని ఓ గుర్తుతెలియని వ్యక్తి బెదింపులకు పాల్పడ్డాడు. అతను ల్యాండ్‌లైన్ నంబర్ నుంచి రెండు సార్లు కాల్ చేశారు. ఈ బెదిరింపు కాల్స్ రావడంతో గడ్కరీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసు ఘటనపై పోలీసులకు సమాచారం అందించింది. సీనియర్ పోలీసు అధికారులు గడ్కరీ కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ప్రస్తుతం నాగ్‌పూర్ పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు. నాగ్‌పూర్‌లోని ఖమ్లా రోడ్డులో ఉన్న కేంద్ర మంత్రి గడ్కరీ ప్రజా సంబంధాల కార్యాలయానికి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు జాతీయ మీడియా ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. ఆ వ్యక్తి డిమాండ్ చేసిన సొమ్మును చెల్లించకుంటే కేంద్ర మంత్రి గడ్కరీని హత్య చేస్తామని ఫోన్ కాల్ ద్వారా బెదిరించాడు. దావూద్ పేరు చెప్పిన ఆ నిందితుడు రెండు సార్లు కాల్ చేసి నగదు డిమాండ్ చేశాడు. డిమాండ్ చేసిన సొమ్ము ఇవ్వకపోతే కేంద్ర మంత్రి గడ్కరీని హత్య చేశామని వార్నింగ్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఇక దీనిపై నాగ్‌పూర్‌ డీసీపీ రాహుల్‌ మదనే స్పందించారు. శనివారం నిందితుడు మూడుసార్లు ఫోన్ కాల్స్ వచ్చాయి. మా క్రైమ్ బ్రాంచ్ దీనిపై విచారణ చేపట్టింది. మంత్రి గడ్కరీ కార్యక్రమం వేదిక వద్ద కూడా భద్రత పెంచినట్లు డీసీపీ వెల్లడించారు.