News

వీఐపీ హజ్‌ యాత్ర కోటా త్వరలో రద్దు.. కారణం ఇదే!

280views

ఏటా ముస్లిం యాత్రికులకు ఇచ్చే వీఐపీ హజ్‌ కోటాకు కేంద్ర ప్రభుత్వం త్వరలో స్వస్తి పలకనుంది. ఈ కోటాను నిలిపివేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశం వీఐపీ విధానానికి ముగింపు పలకడమేనని ఆమె చెప్పారు. యుపీఏ హయాంలో ఏర్పాటైన ఈ వీఐపీ కోటా సంస్కృతికి ముగింపు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ తొలి రోజుల్లోనే చెప్పారని ఆమె గుర్తు చేశారు. త్వరలో నూతన సమగ్ర విధానాన్ని ప్రకటిస్తామని మంత్రి ఇరానీ వెల్లడించారు.

వీఐపీ హజ్‌ కోటా అంటే ఏమిటంటే..
ఏడాదిలో ఒకసారి చేపట్టే హజ్‌ యాత్రలో భాగంగా ముస్లిములు సౌదీ అరేబియాలోని మక్కాకు వెళ్తుంటారు. భారత్‌లోని అత్యున్నత రాజ్యాంగ పదవులలో ఉన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి, హజ్‌ కమిటీ సూచనల మేరకు.. సుమారు 500 మందిని వీఐపీ కోటా కింద హజ్‌ యాత్రకు నామినేట్‌ చేసే అధికారం ఉంది. ప్రస్తుతం దీన్ని నిలిపివేయాలని బీజేపీ యోచిస్తోంది. త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఇరానీ తెలిపారు. ఈ కోటాను తొలగించడంతో ఇకపై హజ్‌కమిటీ, ప్రైవేట్‌ సంస్థల ద్వారానే ముస్లిం యాత్రికులు హజ్‌ యాత్ర చేపట్టాల్సి ఉంటుందని చెబుతున్నారు.