News

తీవ్రవాదుల ముప్పు ఉన్నందున… ఆ రాష్ట్ర విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం!

227views

తీవ్రవాదుల ముప్పుందన్న కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగ హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు, ముంబయి, హైదరాబాద్‌ రాష్ట్రంలోని విమానాశ్రయాలకు భద్రత పెంచారు. అదే విధంగా సందర్శకుల రాకపై నిషేధం విధించినట్లు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ అధికారులు తెలిపారు. అయితే మరోవైపు ఈ నెల 26న రిపబ్లిక్‌ డే వేడుకలను కోలాహలంగా జరుపుకొనే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను అడ్డుకొని విధ్వంసాలు సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థలు వ్యూహం రచించాయని కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారుల సమాచారంతో కూడిన హెచ్చరికలు జారీ చేశారు. దీంతో స్థానిక పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీస్‌, కమాండో బలగాలు, సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూర్‌, మదురై, తూత్తుకుడి తదితర విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. స్వదేశీ, విదేశీ విమానాల్లో ప్రయాణం చేయాల్సిన, అదే విధంగా పలు ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వస్తున్న విమానాలు దిగే ప్రయాణికుల లగేజీని స్కానర్‌ పరికరాల ద్వారా తనిఖీ చేస్తున్నారు. షిఫ్ట్‌ పద్ధతిలో 24 గంటలు భద్రతా బలగాలు విధులు నిర్వహించాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముందు జాగ్రత్త చర్యల కింద ఈ నెల 20 నుంచి 30వ తేది వరకు విమానాశ్రయాలను సందర్శించేందుకు నిషేధిం విధించారు. విమానాశ్రయాలకు మాత్రమే కాకుండా ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్‌ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయాలు, చర్చీలు, మసీదులు, ప్రముఖ పర్యాటక కేంద్రాలు, సముద్రతీర ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేశారు.