News

ఉత్తరాదిపై కోల్డ్ వేవ్ పంజా…. కనిష్ట స్థాయికి చేరిన ఉష్ణోగ్రతలు… ఢిల్లీ, పంజాబ్, హర్యానాలలో రెడ్ అలర్ట్, రాజస్థాన్, బీహార్లలో ఆరెంజ్ అలెర్ట్!

315views

దేశ రాజధాని ఢిల్లీతోపాటు పంజాబ్, ఉత్తర్‌ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లకు ఐఎండీ అధికారులు సోమవారం తీవ్రమైన చలి గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర భారతదేశంలో చలి తీవ్రతరం కావడంతో అనేక రాష్ట్రాలు వణికిపోతున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. దానికి తోడు పొగమంచు కూడా అధికం కావడంతో వాతావరణ శాఖ ఢిల్లీతో పాటు ఆయా రాష్ట్రాలలో హెచ్చరికలు జారీ చేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు పంజాబ్, హర్యానాలలో రెడ్ అలర్ట్, రాజస్థాన్, బీహార్లలో ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది.

వాయువ్య భారతదేశంలో కొనసాగుతున్న తీవ్రమైన చలిగాలుల ప్రభావంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని పాఠశాలలు ఇప్పటికే సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుత చలి పరిస్థితుల దృష్ట్యా సెలవులు పొడిగిస్తూ వివిధ రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవులు పొడిగిస్తూ మళ్లీ నోటీసు జారీ చేసింది. అన్ని పాఠశాలలు జనవరి 14 వరకు మూసివేయబడతాయి అని పేర్కొంది. 9 నుండి 12 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించబడతాయని వెల్లడించారు. ఇక జనవరి 16 నుండి తరగతులు కొనసాగించే అవకాశం ఉందని తెలిపింది.

దక్షిణాది రాష్ట్రల్లో పెరిగిన చలి తీవ్రత..
దక్షిణాది రాష్ట్రల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో చలి వణికిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 1.5 డిగ్రీలో ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తరాంధ్రలోని సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపే ఉంటున్నాయి. దక్షిణకోస్తా, రాయలసీమల్లోనూ 10 నుంచి 15 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎన్టీఆర్‌, పల్నాడు, బాపట్ల, ఏలూరు, కర్నూలు, గుంటూరు, నంద్యాల తదితర జిల్లాల్లో 10 డిగ్రీల నుంచి 13 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం, అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల 15 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా చోట్ల గణనీయంగా పడిపోయాయి.