
మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండిలో ఈ నెల మూడో తేదీన దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. 14 ఏళ్ల వయసున్న బాలుడు “పాకిస్తాన్ జిందాబాద్” అంటూ నినాదాలు చేయడం సంచలనంగా మారింది. ఈ సంఘటన భివాండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం బయట చోటుచేసుకోవడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అయిదుగురు మహిళలతో సహా 19 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.
ఘటనకు కారణాలు ఇవే..
భివాండిలోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఓ విద్యార్థికి ఫీజు చెల్లించాలని సూచించింది. అయినా విద్యార్థి కుటుంబ సభ్యులు చెల్లించకపోవడంతో అతన్ని స్కూల్లోకి అనుమతించలేదు. దీంతో ఆ విద్యార్థితోపాటు కుటుంబ సభ్యులు, కొంతమంది కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఈక్రమంలో ఆ బాలుడు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశాడు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఈక్రమంలో పుణేలో నిర్వహించిన ఆందోళనల్లో పలువురు నిరసనకారులు “పాకిస్తాన్ జిందాబాద్” అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇలాంటి దృశ్యాలు చూసిన పిల్లలు సైతం వాటిని అలవాటు చేసుకుంటున్నారా అంటూ.. పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేశ జాతీయత, సమైక్యత దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.





