News

‘మట్టి కుస్తీ’ పోటీలకు హైదరాబాద్‌ ఆతిథ్యం.. ఈ సారి ‘హింద్‌ కేసరి’ రెజ్లర్లు ఎవరంటే?

523views

పుష్కర కాలం తర్వాత భాగ్యనగరంలో మరోసారి సంప్రదాయ కుస్తీ పోటీలకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం పెద్దస్థాయి ఈవెంట్లలో అధికారిక క్రీడగా ఉన్న ‘మ్యాట్‌ రెజ్లింగ్‌’ కాకుండా మట్టిలో జరిగే హోరాహోరీ సమరాలకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. అందుకే గత 65 ఏళ్లుగా పలువురు అగ్రశ్రేణి రెజ్లర్లను భాగస్వాములుగా చేస్తూ ఈ టోర్నీలను ‘ఇండియన్‌ స్టయిల్‌ రెజ్లింగ్‌ అసోసియేషన్‌’ విజయవంతంగా నిర్వహిస్తోంది.

‘హింద్‌ కేసరి’గా గుర్తింపు తెచ్చుకునేందుకు రెజ్లర్లు తలపడే ఈ ఆసక్తికర మట్టి కుస్తీ టోర్నీకి ఎల్బీ స్టేడియం వేదికవుతోంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో ప్రముఖ రెజ్లర్లందరూ తలపడతారు. గురువారం సాయంత్రం రెజ్లర్ల వెయింగ్‌ తీసుకుంటారు. సుదీర్ఘ కాలం పాటు తెలంగాణలో రెజ్లింగ్‌ సంఘానికి చిరునామాగా నిలిచిన విజయ్‌కుమార్‌ యాదవ్‌ స్మారకంగా ఈ టోర్నమెంట్‌ను వ్యవహరిస్తున్నారు.

పురుషుల విభాగంలో ‘హింద్‌ కేసరి’ టైటిల్‌
విజేతకు రూ. 3 లక్షలతోపాటు 3 కిలోల వెండి గద బహుమతిగా లభిస్తుంది. రన్నరప్‌కు రూ. 2 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన రెజ్లర్‌కు రూ. 1 లక్ష అందజేస్తారు. మహిళల్లో ‘హింద్‌ కేసరి’కి రూ. లక్ష నగదు బహుమతి అందజేస్తారు. ఇతర వెయిట్‌ కేటగిరీ విజేతలకు కూడా నగదు పురస్కారాలు ఇస్తారు. హైదరాబాద్‌లో ‘హింద్‌ కేసరి’ పోటీలు జరగడం ఇది మూడోసారి. 1958లో తొలిసారి జరగ్గా… 2011లో రెండోసారి హైదరాబాద్‌ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. 2011లో మధ్యప్రదేశ్‌కు చెందిన రోహిత్‌ పటేల్‌ ఫైనల్లో మౌజమ్‌ ఖత్రీని ఓడించి ‘హింద్‌ కేసరి’ టైటిల్‌ సాధించాడు. మరి ఈసారి హింద్‌ కేసరి టైటిల్‌ ఎవరు గెలుచుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే!!