News

జనాభా నియంత్రణ దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు: మంత్రి గిరిరాజ్ సింగ్

313views

న్యూఢిల్లీ: దేశంలో జనాభాను నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ జనాభా పెరిగిపోవడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని , జనాభా పెరిగిపోవడం వల్లే సమతౌల్యం దెబ్బతింటుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ హెచ్చరించారు. దీన్ని నియంత్రించడానికి తక్షణ కార్యాచరణ ప్రణాళికలను చేపట్టాల్సిన అవసరం ఉందని చెబుతూ ఈ దిశగా తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వెల్లడించారు.

ఇందులో భాగంగా జనాభా నియంత్రణ బిల్లును రూపొందించనున్నట్టు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది నాటికి దేశ జనాభా భారీగా పెరగబోతోందని, ఈ విషయంలో చైనాను సైతం అధిగమిస్తుందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరో ఏడాది కాలంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుందంటూ వెలువడిన అంచనాలపై ఆయన మాట్లాడారు.

జనాభా పెరుగుదల వల్ల మతపరమైన అసమతౌల్యం ఏర్పడే అవకాశం లేకపోలేదని గిరిరాజ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రజల్లో చైతన్యం కల్పించేలా చర్యలు చేపట్టాల్సి ఉందని చెబుతూ… ప్రజలకు అవగాహన కలిగించినప్పుడే జనాభా నియంత్రణ బిల్లు ఉద్దేశం నెరవేరుతుందని ఆయన చెప్పారు.

భవిష్యత్‌లో దేశంలో జనాభా నియంత్రణ బిల్లు అత్యంత కీలకంగా మారుతుందని గిరిరాజ్ సింగ్ జోస్యం చెప్పారు. అన్ని మతాల వారికీ సమానంగా ఈ బిల్లును వర్తింపజేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. వనరులు పరిమితంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి