
విశాఖపట్నం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రధాని బహిరంగ సభ కోసం ఎంపిక చేసిన ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌ను కలెక్టర్ ఎ.మల్లికార్జున, పోలీసు కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు, వీసీ ప్రసాదరెడ్డితో కలిసి విజయసాయిరెడ్డి బుధవారం పరిశీలించారు.
రూ.10,472 కోట్ల పనులకు శ్రీకారం
ఈ నెల 12న రూ.10,472 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారని కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, రాయపూర్–విశాఖపట్నం 6 లేన్ల రహదారి, కాన్వెంట్ జంక్షన్–షీలానగర్ పోర్టు రోడ్డు అభివృద్ధి, విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, గెయిల్‌కు సంబంధించి శ్రీకాకుళం–అంగుళ్ పైప్‌లైన్ ఏర్పాటు, నరసన్నపేట–ఇచ్ఛాపురం రోడ్డు అభివృద్ధి, ఓఎన్‌జీసీ ఆఫ్‌షోర్ కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పారు.





