
424views
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. సోమవారం ఉదయం ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, తితిదే ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఈ వేడుకను నిర్వహించారు. భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని కోరుతూ దీపావళి ఆస్థానం నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీనివాస దీక్షితులు చెప్పారు. స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు అలంకరించినట్లు తెలిపారు. ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీకృష్ణశేషాచల దీక్షితులు మాట్లాడుతూ బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించినట్టు వివరించారు.
Source: Eenadu





