News

పశువులలో లంపీ స్కిన్‌ వ్యాధికి త్వరలో దేశీయ టీకా – ప్రధాని మోడీ

375views

దేశవ్యాప్తంగా పశువుల్లో వ్యాపిస్తోన్న లంపీస్కిన్‌ వ్యాధి వల్ల రైతులు, వారి ఆదాయంపై ప్రభావం పడుతోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ప్రధాని తెలిపారు. 2025 నాటికి వందశాతం పశువులకు టీకా అందిస్తామన్న ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.

గతకొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లోని పశువులను లంపీ చర్మవ్యాధి పీడిస్తోంది. జులై నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 67వేల మూగజీవాలు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎనిమిది రాష్ట్రాల్లో వ్యాధి తీవ్రత ప్రబలంగా ఉందని.. ఆయా రాష్ట్రాల్లో పశువులకు వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా చేపడుతున్నామని తెలిపింది. వ్యాధిని నియంత్రించేందుకు ప్రస్తుతం గోట్ ‌పాక్స్‌ వ్యాక్సిన్ ను‌ అందిస్తున్నామని, దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రానుందని పేర్కొంది.

దేశంలోని పశువులను లంపీ స్కిన్‌ వేధిస్తోన్న వేళ.. వ్యాక్సిన్ ‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని పశుసంవర్ధక శాఖ కార్యదర్శి జతింద్రనాథ్‌ స్వెయిన్‌ వెల్లడించారు. ఇందులో భాగంగా కేంద్ర వ్యవసాయ పరిశోధనా విభాగం ఐసీఏఆర్ ‌కు చెందిన రెండు సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ వచ్చే మూడు, నాలుగు నెలల్లోనే మార్కెట్‌లోకి వస్తుందన్నారు. ప్రస్తుతం ఈ వ్యాధి తీవ్రత గుజరాత్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్య ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో అధికంగా ఉందని.. ఆంధ్రప్రదేశ్‌, అండమాన్‌ నికోబార్‌లలోనూ కొన్నిచోట్ల ఈ వ్యాధి కేసులు ఉన్నాయన్నారు.

రాజస్థాన్‌లో నిత్యం ఏడు, ఎనిమిది వందల పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఈ సంఖ్య రోజుకు వందకు దిగువలోనే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. దేశంలో మొత్తం 20కోట్ల పశువులు ఉన్నాయన్న జతింద్రనాథ్‌ స్వెయిన్‌.. ఇప్పటివకే వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో 1.5కోట్ల డోసులను పంపిణీ చేశామని తెలిపారు. లంపీస్కిన్‌ వ్యాధి నివారణకు తయారు చేసిన వ్యాక్సిన్‌ డీసీజీఐ అనుమతి రావాల్సి ఉందని.. వచ్చే మూడు, నాలుగు నెలల్లో వాణిజ్య అనుమతులు వచ్చే అవకాశముందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.