
భారత్ జోడో యాత్ర పేరుతో సుదీర్ఘ పాదయాత్రను మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ.. తాజాగా నిక్కర్ పాలిటిక్స్ కు తెరలేపింది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కు గతంలో డ్రెస్ కోడ్ గా ఉన్న ఖాకీ నిక్కర్ ను కాల్చుతున్న ఫొటోను కాంగ్రెస్ పార్టీ ట్విటర్‌లో పోస్టు చేయడం ఇందుకు కారణమయ్యింది. దీనిపై భాజపా, ఆరెస్సెస్ లు తీవ్రంగా స్పందించాయి. దేశంలో హింస జరగాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారా? అని ప్రశ్నించాయి.
దీనిపై RSS సహ సర్ కార్యవాహ (ఆరెస్సెస్ జాయింట్ జనరల్ సెక్రటరీ) శ్రీ మన్మోహన్ వైద్య మాట్లాడుతూ…. “విద్వేషకర భావజాలంతో భారత్ జోడో యాత్ర చేయలేరు..భారత్ ను కలపలేరు..
భారత్ ను కేవలం ప్రేమతో మాత్రమే కలుపగలరు. కానీ కాంగ్రెస్ పార్టీ, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా కలపగలనని భావిస్తోంది.
ఇలా విద్వేషకర రాజకీయాలు నడపడం కాంగ్రేస్ కు అలవాటే..ఈయన తండ్రి..నానమ్మ..ముత్తాత ఆయన పూర్వీకులు అందరూ ఈ తరహా రాజకీయాలు చేసినవారే.. సంఘ్ ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినవారే..
దేశాన్ని ప్రేమతో మాత్రమే జోడించగలం..కాంగ్రేస్ చేస్తున్న విద్వేషకర రాజకీయాలతో దేశం ఏకం కాదు. కాంగ్రెస్ చాలా ప్రమాదకరమైన రాజకీయాలు చేస్తున్నది. ఒక విధంగా సంఘ్ మీదకు ప్రజలను రెచ్చగొడుతున్నది. సంఘ్ ప్రజలతో మమేకమై ఉంది. ప్రజల మద్దతుతో ఎదిగింది, ఎదుగుతుంది. రాబోయే 50 సంవత్సరాల వరకూ దేశప్రగతి కోసమై, జాతి ఐక్యత కోసమై సంఘ్ దగ్గర స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయి.” అన్నారు.